‘నీట్’ రివైజ్డ్ రిజల్ట్స్ విడుదల!
posted on Jul 25, 2024 6:05PM
‘నీట్’ తుది ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం నాడు విడుదల చేసింది. మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రివైజ్డ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో 4.2 లక్షల మంది విద్యార్థులు 5 మార్కులను కోల్పోయారు. దీంతో టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కి తగ్గింది.
ఫిజిక్స్ విభాగంలోని ఆటమిక్ థియరీకి సంబంధించి 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు వున్నాయని, దేన్ని ఎంపిక చేసినా మార్కులిచ్చారని ఆరోపిస్తూ ఒక విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ఈ క్రమంలోనే సంబంధిత ప్రశ్నకు రెండు సమాధానాలు లేవని, ఒక్క సమాధానం మాత్రమే వుందని సదరు ప్రశ్నకు ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు నివేదించింది. దీంతో ఆప్షన్ 4ను ఎంచుకున్న వారికే మార్కులను ఇవ్వాలని ధర్మాసనం పరీక్ష నిర్వాహకులను ఆదేశించింది. దాంతో నీట్ రివైజ్డ్ ఫలితాలను విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది.
తాజా ఫలితాలలో సుమారు 4 లక్షల 20 వేల మంది విద్యార్థులు 5 మార్కులు కోల్పోయారు. సదరు ప్రశ్నకు రావలసిన 4 మార్కులతోపాటు తప్పు సమాధానం రాసినందుకు 1 మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు కోల్పోవాల్సి వచ్చింది. నీట్’లో 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించిన 61 మందిలో ఈ ప్రశ్నకు తప్పు సమాధానం రాసిన వారు 44 మంది వున్నారు. దాంతో వారి స్కోరు కూడా మారిపోవడంతో మొదటి ర్యాంకు సాధించిన వారి సంఖ్య 17కి తగ్గింది.