కలల కాన్వాసు మనమే గీసుకుందాం!

కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అని అంటారు అబ్దుల్ కలాం. ఈయన మన భారతీయులకు గొప్ప ప్రేరణ. ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి, దీపం వెలుగులో చదువుకుని, అంతరిక్షానికి రాకెట్లను పంపే విజ్ఞానాన్ని ఒడిసి పట్టి శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అంటే.. కలలను సాకారం చేసుకోమని ఈయన ఇచ్చిన ఆలోచన ఎంత గొప్పదో చర్చించుకోవడానికి. అలాగే ఈ ఆలోచనకు మరొక రూపమా అన్నట్టుండే మరొక విషయాన్ని, ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తిని గురించి మాట్లాడుకోవడానికి.

NAtional dream day…

కలలను కనడం వాటిని నిజం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ గొప్పతనం వెనుక మనిషి కృషి, పట్టుదల, అవిరామ సాధన ఎంతో ఉంటుంది. కలలను గూర్చి కథలుగా మాత్రమే చెప్పుకునే కాలం కాదు జీవితాలను కథలు కథలుగా, స్ఫూర్తి మంత్రాలుగా చెప్పుకునే కాలమిది.

మనిషి గొప్పగా ఎదగడానికి అడ్డుకునేది ఏదీ ఈ ప్రపంచంలో లేదు.. ఉన్న అడ్డంకల్లా మనకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మొదటే మనం అభిప్రాయపడటం. బిడ్డ పుట్టాక ఏడుపు నుండి నవ్వుతూ ఉండటానికి సమయం పడుతుంది. పిల్లవాడికి పండ్లు మొలిచేటప్పుడు ధవడలు చెప్పలేనంత నొప్పిని అనుభూతి చెందుతాయి. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మోకాళ్ళు గీరుకుపోయి నొప్పి పెడతాయి. అవన్నీ సమస్య అనుకుంటే ఎవరూ నడక నేర్వలేరు కదా… అలాగే మనిషి దశలు మారేకొద్ది సమస్యలు కూడా విభిన్న రూపాలు దాలుస్తాయి. సమస్యలను చూసుకుని ఆగిపోయే వారు జీవితంలో గొప్ప స్థానానికి వెళ్లలేరు. 

అందుకే కలలను కనమని ప్రోత్సహించే రోజు ఒకటుంది. ప్రతి ఏటా మార్చి 11న జరుపుకునే జాతీయ కలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ  రోజున మన జీవితంలో జరగవులే అనే ఆలోచనతో వదిలిపెట్టేసిన  మీ కలలను తిరిగి వేటాడటం మొదలుపెట్టండి. యువకుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే.. కావాల్సిందల్లా సంకల్ప బలమే..

"ది మిలీనియం మ్యాన్," రాబర్ట్ ముల్లర్ చేత ప్రేరణ పొంది ఈ కలల దినోత్సవం ఏర్పడింది.   ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున దీన్ని జరుపుకుంటారు. డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ పిల్లల కలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది.  ఇది అన్ని వయసుల వారికి స్ఫూర్తినిచ్చినప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. 

ఎవరు రాబర్ట్ ముల్లర్..

మన దేశానికి కలాం తెలుసు..  ఈ ప్రపంచానికి ముల్లర్ తెలుసు. చాలామందికి తెలియని విస్తృతమైన ప్రపంచం ఇది. రాబర్ట్  ముల్లర్ ఒక శరణార్థి, జైలు శిక్ష తప్పించుకునే భయానక పరిస్థితులను అనుభవించాడు.  ఫ్రెంచ్ ప్రతిఘటనలో సభ్యుడు కూడా అయ్యాడు. అతను 25 సంవత్సరాల వయస్సులో ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు, అక్కడ తన జీవితంలోని తరువాతి 40 సంవత్సరాలను అంకితం చేశాడు. అనేక అవార్డులు, నామినేషన్లు ఈయన సొంతమయ్యాయి. 14 పుస్తకాలు వేలకొద్దీ రచనలు తరువాత, 1986లో కోస్టా రికాలో  పదవీ విరమణ చేసాడు, అక్కడ అతను ఐక్యరాజ్యసమితి యొక్క యూనివర్శిటీ ఫర్ పీస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు, దీన్ని స్థాపించడంలో సహాయం చేశాడు. బెంచ్ ఆఫ్ డ్రీమ్స్ డ్రీమ్ బెంచ్ డైరీని కూడా రూపొందించాడు. 

ఇలా ఒక శరణార్థిగా ఉన్న వ్యక్తి తన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. రాబర్ట్ ముల్లర్ గూర్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే..

1923

"ది మిలీనియం మ్యాన్"

రాబర్ట్ ముల్లర్ మార్చి 11న బెల్జియంలో జన్మించాడు.

1948

ముల్లర్ ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు.

1987

మీ కలల కోసం ఒక బెంచ్ సృష్టించాలని..

ముల్లర్ డెస్ బెర్గోఫర్ మరియు గెర్రీ స్క్వార్ట్జ్ సహాయంతో బెంచ్ ఆఫ్ డ్రీమ్స్‌ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు.

1995

జాతీయ కలల దినోత్సవాన్ని డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ రూపొందించింది. పెద్దకలలు కనడం వాటిని నిజం చేసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 

                                   ◆నిశ్శబ్ద.