మరో హామీ నెరవేర్చిన నారా లోకేష్
posted on Oct 7, 2024 2:15PM
.webp)
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంగతి తెలసిందే. ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన పలు వాగ్దానాలు చేశారు. సరే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన లోకేష్ తాజాగా మరో వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యప్తంగా ఉన్న చిన్న దేవాలయాలలో ధూప, దీప నైవేద్యాలకు ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెట్టింపు చేస్తుందని లోకేష్ వాగ్దానం చేశారు. ఇప్పుడా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్ంగా ఉన్న దాదాపు 5400 చిన్న ఆలయాలకు లబ్ధి చేకూరే విధంగా ధూప,దీప, నైవేద్యాలకు ఇచ్చి ప్రభుత్వ సాయాన్ని ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్విట్లర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా చిన్న ఆలయాల్లో దూప, దీప, నైవేద్యాలు నిర్వహించడం కష్టంగా ఉందన్న విషయాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గం తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం తమ బాధ్యత అని అప్పట్లో వారికి చెప్పి.. అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చానని, ఇప్పటి వరకూ ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5000లుగా ఉన్న ప్రభుత్వ సాయాన్ని పది వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు.