యాంటీ ఇంకంబెన్సీయే కాదు.. అంతకు మించి!
posted on Oct 7, 2024 1:56PM
.webp)
ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ పై దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో సందేహానికి తావు లేకుండా రుజువు చేశాయి. మోడీ సర్కార్ కు అంటే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ప్రజలు పూర్తిగా అంగీకరించలేకపోయారన్నదానికీ ఈ ఎన్నికల ఫలితం నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే 2014, 2019 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ కు తిరుగులేని మెజారిటీ ఇచ్చి, కాంగ్రెస్ ను విపక్ష హోదా కోసమే ఇబ్బంది పడేలా తీర్పు ఇచ్చారు. అదే ప్రజలు 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ను బలమైన ప్రతిపక్షంగా ఎన్నుకున్నారు. అదే సమయంలో గతానికి భిన్నంగా మోడీ సర్కార్ మనుగడ కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి కల్పించారు.
అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఒకటి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం కాగా, మరొకట హర్యానా. ముందుగా హర్యానా విషయానికి వస్తే.. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి శరాఘాతం కానున్నాయని ఎగ్జిట్ పోల్స్ సందేహాలకు అతీతంగా వెల్లడించాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5న ఒకే విడతలో జరిగాయి. ఫలితాలు ఈ నెల 8న విడుదలౌతాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానాలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 55 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయన్నది ఎగ్జిట్ పోల్స్ ఫలితం. చెబుతోంది. అంటే సింపుల్ మెజారిటీ కంటే దాదాపు 10 స్థానాలు అధికంగా కాంగ్రెస్ గెలుచుకోనుంది.
ఇక పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 32 స్థానాలకు పరిమితమౌతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పదేళ్ల బీజేపీ పాలనకు ఎండ్ కార్డ్ పడినట్లే. అయితే ఈ సారి గమనించాల్సిన విషయమేంటంటే హర్యానాలో బీజేపీ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల పెల్లుబికిన ఆగ్రహం కూడా జనం ఈ స్థాయిలో స్పందించడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో మూడు దశలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 5, 25, అక్టోబర్ 1న మూడు విడతలుగా జరిగిన పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి జమ్మూ కాశ్మీర్ లో ప్రతికూల ఫలితం రావడం ఖాయమని తేలింది. అయితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. వాస్తవానికి 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రం పాలనలోనే ఉంది. ఆర్టికర్ 370 రద్దు రాష్ట్రంలో తమకు భారీగా లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావించింది. అయితే ఫలితం అందుకు భిన్నంగా ఉండబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో సింపుల్ మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన 46 స్థానాలను అటు కాంగ్రెస్ కూటమి కానీ, ఇటు బీజేపీ కూటమి కానీ సాధించే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాలలోనూ బీజేపీకి ఎదురుదెబ్బతప్పదని తెలడంతో బీజేపీలో ఆందోళన వ్యక్తమౌతోంది. అసలే కేంద్రంలో ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మద్దతుతో నడుస్తున్న నేపథ్యంలో హర్యానా, జమ్మూ కాశ్మీర్ లలో ఎగ్జిట్ పోల్స్ నిజమై ప్రతికూల ఫలితాలు వస్తే బీజేపీ చిక్కులు మరింత పెరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.