ఇప్పుడు ఏమంటావ్ కేసీఆర్

 

నోటు ఓటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో మొదటి నుండి ఏపీ ముఖ్యమంత్రి సహా పలువురి అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేం ఫోన్లు ట్యాపింగ్ చేయలేదంటూ వాదిస్తూ వచ్చాయి. కానీ విజయవాడ కోర్టులో హాజరైన సర్వీసు ప్రొవైడర్లు తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు వాటికి సంబధించిన సమాచారం ఇవ్వాలని కోరగా సర్వీసు ప్రొవైడర్లు మాత్రం అందుకు నిరాకరించారు. ఆ సమాచారం ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించిందని.. కాల్ డేటా అందించవద్దని చెప్పిందని కోర్టుకు చెప్పారు . కానీ కోర్టు అవన్నీ తోసిపుచ్చి కాల్ డేటా ఇవ్వాల్సిందేనని తీర్పు నిచ్చింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. అలాంటి పప్పులేమి ఉడకవు కాల్ డేటా ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పింది. దీంతో సర్వీసు ప్రొవైడర్లు వారం రోజులు గడువు కోరారు.

 

ఇప్పుడు దీనిపై టీడీపీ యువనేత.. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారాలోకేశ్ స్పందించి కేసీఆర్ పై ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.. ఇప్పుడు టెలికాం కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి.. ఇప్పుడు కేసీఆర్ మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పెదొకటి చేసేదొకటి అని.. వారు అవునంటే కాదని.. కాదంటే అవునని విమర్శించారు. గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్ధులను బలిచేశారు.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను బలి చేశారని ట్విట్టర్లో మండిపడ్డారు.