నాగార్జునసాగర్ లో సంపూర్ణ లాక్ డౌన్ ? 

ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. సాగర్ నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయి. గత రెండు, మూడు రోజులుగా భారీగానే కేసులు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది. 

సాగర్ నియోజకవర్గ పరిధిలో  రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నియోజవర్గ పరిధిలోని పీహెచ్సీలకు టెస్టులు కోసం జనాలు భారీగా వస్తున్నారు. కిట్స్ కొరతతో టెస్టులు చేయలేక చేతులెత్తేశారు వైద్యశాఖ సిబ్బంది. దీంతో నల్గొండ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 
కేసీఆర్ సభ,ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్ క్వారంటయిన్ కావాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి చేజారక ముందే లాక్ డౌన్ విధించాలనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు లౌక్ డౌన్ విధిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. 

మరోవైపు కరోనా విజృంభణతో నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇండ్ల నుంచి బయటికి రావడానికే జంకుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ కేసులు వస్తున్నాయని తెలుస్తోంది. గిరిజన తండాల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటంతో అధికారులను మరింత కలవరపెడుతోంది. దీంతో లాక్ డౌన్ పెడితేనే బాగుంటుందని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుతున్నారు.