తిరుపతిలో సంచలన ఫలితం! సర్వేలో ఏం తేలిందంటే? 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. తిరుప‌తి తమదేనని  పోటాపోటీగా ప్రకటనలు చేశారు అధికార వైసీపీ నేతలు. ఐదు లక్షల మెజార్టీ వస్తుందని ఒక మంత్రి అంటే... ఆరు లక్షలు క్రాస్ చేస్తామని మరో మంత్రి చెప్పుకొచ్చారు. అరెవో సాంబా.. రాస్కో.. అన్నంత బిల్డ‌ప్ ఇచ్చారు. తీరా పోలింగ్ రోజు వ‌చ్చేస‌రికి చేతులెత్తేశారు. పోలింగ్ సరళి చూశాక అధికార వైసీపీలో గెలుపు భ‌యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. 

ఓడిపోతామ‌నే భయంతోనే వైసీపీ నేతలు దొంగ ఓట్ల‌తో దిగ‌జారిపోయారని అంటున్నారు. అందుకే  తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు. ఒక‌టా, రెండా.. వంద‌లాది బ‌స్సులు.. వేలాది మంది దొంగ ఓట‌ర్లును.. తిరుప‌తి మొత్తం దించేశారు. విచ్చ‌ల‌విడిగా దొంగ ఓట్లు వేయించుకోవాలని చూశారు. అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి ఎస్కార్టులు.. పాల‌కులే దగ్గ‌రుండి మ‌రీ దొంగ ఓట్లు వేయించారు.  అయితే టీడీపీ నేతల అప్రమత్తతో దొంగ ఓట్ల బండారం బట్టబయలైంది. మీడియా సాక్షిగా దొంగ ఓట్ల ప్ర‌హ‌స‌నం బయటపడంతో చేసిది లేక వందలాది బస్సులను పోలీసులు తిరిగి పంపించేశారు. వైసీపీ ఇంత చేసినా పోలింగ్ శాతం 65 శాతం ద‌గ్గ‌రే ఆగిపోయింది. దీంతో త‌క్కువ శాతం పోలింగ్ ఎవ‌రికి లాభం? మ‌రెవ‌రికి న‌ష్టం? అనే విశ్లేష‌ణ‌లు జోరుగా సాగుతున్నాయి. ఓటింగ్ శాతం త‌గ్గ‌డం అధికార పార్టీని క‌ల‌వ‌రానికి గురి చేస్తోందని తెలుస్తోంది. 6 ల‌క్ష‌ల మెజార్టీ మాటేమో గానీ.. గెలిస్తే  అదే చాల‌న్న భ‌యం వారిని వెంటాడుతోందని చెబుతున్నారు. 

రాజకీయ విశ్లేషకులు, వివిధ సంస్థల అంచనా ప్రకారం తిరుపతిలో షాకింగ్ ఫలితం రాబోతోందని తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో నెల్లరు జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో మూడున్నర లక్షల మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ నేతలు. అయితే పోలింగ్ తర్వాత మాత్రం నెల్లూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో కలిపి 50 వేల మెజార్టీ వస్తే మహాగొప్ప అన్నట్లుగా ఉందట వైసీపీ పరిస్థితి. గూడురు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉండగా.. వెంకటగిరిలో మాత్రమే 20 వేల లీడ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలే అంచనాకు వచ్చారట. ఈ నియోజకవర్గ పరిధిలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మిగితా మూడు నియోజకవర్గాల్లో కలిసి మరో 30 వేల వరకు మాత్రమే అధికార పార్టీకి లీడ్ రావచ్చంటున్నారు. 

నెల్లూరు జిల్లాలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుందని భావించిన వైసీపీ నేతలు తాజా అంచనాలతో షాకవుతున్నారట. అయితే వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. స్థానిక నేతలను పట్టించుకోకుండా వాలంటీర్లను జగన్ నమ్ముకోవడం మైనస్ అయిందంటున్నారు. డబ్బులు తమ చేతికి రాకపోవడంతో ద్వితియ శ్రేణి నేతలంతా పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి సైలెంట్ అయ్యారని అంటున్నారు. అధికార పార్టీ డబ్బులు భారీగా పంపిణి చేస్తుందని ప్రచారం జరగగా... చాలా ప్రాంతాల్లో డబ్బులు పంచలేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంచినా రెండు, మూడు వందలతోనే సరిపుచ్చారట. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న ఓటర్లంతా అధికార పార్టీపై కోపంతో .. వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనే చర్చ జరుగుతోంది.స్థానిక వైసీపీ నేతలు కూడా సీరియస్ గా ప్రచారం చేయలేదంటున్నారు. ఎమ్మెల్యేలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఒక కారణమని చెబుతున్నారు. పోలింగ్ రోజునే గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ ను ఓటర్లు అడ్డుకున్నారంటే... జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఊహించవచ్చు. 

చిత్తూరు జిల్లాలో  తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లతో మెజార్టీ సాధించాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే టీడీపీ అప్రమత్తతో అనుకున్నంతగా పోల్ చేసుకోలేదని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. దొంగ ఓట్ల బాగోతం రచ్చ కావడంతో తిరుపతి ఓటర్లు షేమ్ గా ఫీలయ్యారట. అధికార పార్టీ తీరుపై ఆగ్రహంతో టీడీపీకి ఓట్లు వేశారని అంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ కేడర్ గట్టిగా పనిచేయడంతో పోటీ హోరాహోరీగా సాగిందంటున్నారు. సత్యవేడులోనూ టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని పోలింగ్ సరళి తర్వాత అంచనా వేస్తున్నారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో 2019 ఎన్నికల్లో టీడీపీకే లీడ్ వచ్చింది. దీంతో తిరుపతిలో ఈసారి కూడా తమకే ఆధిక్యత వస్తుందని తమ్ముళ్లు పక్కాగా చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్ రోడ్ షోలకు భారీ స్పందన లభించింది. సభలకు వచ్చిన స్పందన పోలింగ్ రోజున కనిపించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో తాము గట్టి పోటీ ఇచ్చామని, తిరుపతి అసెంబ్లీ పరిధిలో లీడ్ సాధిస్తామని అంచనా వేస్తున్నారు. 

మొత్తంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత అధికార వైసీపీలో గుబులు కనిపిస్తుండగా.. తెలుగు దేశం పార్టీలో మాత్రం జోష్ కనిపిస్తోంది. ఘన విజయం సాధిస్తామని బయటికి చెబుతున్నా.. లోలోపల మాత్రం వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. దీంతో మే2న జరిగే ఓట్ల లెక్కింపులో ఏమైనా జరగవచ్చని.. సంచలన ఫలితం రావొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.