400 మంది పోటీ! సాగర్ లో నిజామాబాద్ సీన్ రిపీట్?
posted on Mar 23, 2021 7:25PM
లోక్ సభ ఎన్నికల్లో కవిత ఘోర పరాజయం.. సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్.. కారణం పసుపు రైతులు.. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 178 మంది నామినేషన్ వేయడమే. కవిత టార్గెట్ గా రైతులు ఎన్నికల సమరంలోకి దిగడంతో అధికార పార్టీకి అనూహ్య ఓటమి తప్పలేదు. అప్పటి నిజామాబాద్ స్ట్రాటజీ.. ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో రిపీట్ కాబోతోంది. అప్పుడు పసుపు రైతులు కవితకు షాకిస్తే.. ఇప్పుడు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితికి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక సభ్యులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. సుమారు 400 మంది నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అమరవీరుల ఐక్యవేదిక అధ్యక్షులు రఘుమా రెడ్డి తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. అమరవీరుల ఆశయాల సాధన కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రఘుమారెడ్డి చెప్పారు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. అమరవీరుల కుటుంబాలకు సాయం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని రఘుమారెడ్డి ఆరోపించారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో పుసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేసిన నిజామాబాద్ ఎంపీ స్థానానికి 178 మంది నామినేషన్ వేశారు. పసుపు రైతుల సమస్య జాతీయ స్తాయిలో చర్చానీయంశం చేశారు. పసుపు రైతులు పోటీ చేయడం వల్లే నిజామాబాద్ లో కవిత ఓడిపోయారు. ఇప్పుడు సాగర్ లోనూ 400 మంది పోటీ చేస్తామని ప్రకటించడంతో అధికార టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది