జలుబుతో కరోనాకు చెక్!
posted on Mar 23, 2021 6:21PM
జలుబు వైరస్‌తో కరోనా పరార్. అవును, మీరు చదివింది నిజమే. జలుబు ముందు కరోనా బలాదూర్ అంటున్నారు సైంటిస్టులు. ఇది ఊహో, అంచనానో కాదు. యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్‌గోవ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగ పూర్వకంగా ఈ విషయం నిరూపించారు. జలుబు వైరస్‌కు, కరోనా వైరస్‌కు మధ్య పోటీ పెడితే.. అందులో జలుబు వైరసే గెలిచింది. ఆ ప్రయోగంతో సైంటిస్టుల్లో కొవిడ్‌పై పోరాటంలో విజయం సాధించగలమన్న నమ్మకం పెరిగింది.
జలుబుకు కారణం రైనో వైరస్. ఇది శ్వాసకోస కణజాలంపై దాడి చేస్తుంది. శాస్త్రవేత్తలు రైనో వైరస్‌ను, కరోనా వైరస్‌ను శ్వాసకోస తలంపై ఒకేసారి ప్రయోగించారు. తమ కణజాలాన్ని ఇన్ఫెక్ట్ చేసేందుకు రెండు వైరస్‌లు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. అనూహ్యాంగా జలుబు వైరస్సే గెలిచింది. కణజాలాన్ని ముందుగా రైనో వైరసే ఇన్ఫెక్ట్ చేసి.. కరోనాకు స్థానం లేకుండా చేసింది. మొదటి దశలో జలుబు వైరస్‌దే అప్పర్ హ్యాండ్ కావడంతో.. సెకండ్ లెవల్ టెస్ట్‌కు సిద్ధమయ్యారు సైంటిస్టులు. శ్వాసకోస కణజాలంపై ముందుగా కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టి ఇన్ఫెక్షన్ స్థిరపడేందుకు 24 గంటల గడువిచ్చారు. ఆ తరువాత.. జలుబు వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరంగా.. ఈసారి కూడా జలుబు వైరస్‌దే విజయం. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం రైనో వైరస్‌కు ఉందని దాదాపు నిర్థారణకు వచ్చారు.
అయితే.. ఇందులోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. జలుబు వైరస్ వల్ల కలిగే రోగ నిరోధక శక్తి తాత్కాలికమే. జలుబు తగ్గిపోగానే కరోనా వైరస్ మళ్లీ దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రయోగం భవిష్యత్తులో కరోనాకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా చేసే ప్రయత్నాలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.