మంత్రి కొండా సురేఖ‌పై నాగార్జున కేసు.. వాంగ్మూలాల్లో తేడాలున్నాయా?

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి. తాను ఒక‌టి అనుకుంటే దైవం మ‌రొక‌టి త‌ల‌చిద‌న్న‌ట్లుగా.. కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను టార్గెట్ గా వ్యాఖ్య‌లు చేయ‌బోయి నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగేశారు. అప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని హైడ్రా త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ ను కూల్చేసింద‌ని ర‌గిలిపోతున్న నాగార్జు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. నాగార్జునే రిక్వెస్ట్ చేశారో ఏమో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా  సినీ ఇండ‌స్ట్రీ మొత్తం  ఏక‌మైంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను దాదాపు సినీ ప్ర‌ముఖులు అందరూ ఖండించారు. ప‌నిలో ప‌నిగా కొంద‌రు నాగార్జున హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైనా దుమ్మెత్తిపోశారు.  హైడ్రా, రైతు రుణ‌మాఫీ విష‌యంలో వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌తో అసలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నరేవంత్ ప్ర‌భుత్వానికి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను  చేప‌ట్టింది. కాంగ్రెస్ పెద్ద‌లు కొండా సురేఖ‌ను మంద‌లించ‌డంతో ఆమె ప‌ది మెట్లు దిగొచ్చి నాగార్జున ఫ్యామిలీకి, స‌మంత‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైన కోప‌మో.. నాగ‌చైత‌న్య‌, స‌మంత వ్య‌వ‌హారంపై ప్ర‌తి ఒక్క‌రూ కామెంట్స్ చేస్తున్నార‌న్న ఆగ్రహమో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున సీరియ‌స్ గా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేద‌ని లేద‌ని శ‌పధం చేసిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుపై ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీంతో వీరిద్ద‌రి ఫొటోల‌తో కేటీఆర్‌, హ‌రీశ్ రావు డీపీలు పెట్టుకున్న వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో వీరి గురించి అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల‌పై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, హ‌రీశ్ రావు సురేఖ‌పై పెట్టిన పోస్టుల‌ను తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. దీంతో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌టానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌మంత కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నాగార్జున‌, స‌మంత వైపు నిలిచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నాగార్జున మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో ఆమెపై నాంప‌ల్లి కోర్టులో క్రిమిన‌ల్‌ ప‌రువు న‌ష్టం దావా వేశారు.   ఈ పిటిష‌న్‌పై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా..  త‌మ ఎదుట హాజ‌రై వాంగ్మూలం  ఇవ్వాల్సిందిగా నాగార్జున‌ను కోర్టు ఆదేశించింది. దీంతో మంగ‌ళ‌వారం నాగార్జున‌, అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌తోపాటు సుప్రియ‌ కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. కోర్టు నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ ను రికార్డు చేసింది. అలాగే మొద‌టి సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది. అక్టోబ‌రు 10న మ‌రో సాక్షికి సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేయ‌నున్న‌ట్లు చెప్పి.. త‌దుప‌రి విచార‌ణ వాయిదా వేసింది.

నాగార్జున మంత్రి కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డంతో కొంద‌రు బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసి వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రిపై ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రి కాద‌ని అంటున్నారు. పొర‌పాటు జ‌రిగింద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని కొండా సురేఖ చెప్పినా నాగార్జు ఇంత మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే అగ్ర‌ కులానికి చెందిన మంత్రి అయితే నాగార్జున ఇలానే వ్య‌వ‌హ‌రించేవారా అంటూ బీసీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు బీఆర్ఎస్ వెన‌కుండి నాగార్జున‌ను న‌డిపిస్తున్నద‌ని.. బీఆర్ ఎస్ రాజ‌కీయాల్లో నాగార్జున పావుగా మారారని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, మంత్రి సురేఖ పై ప‌రువు న‌ష్టం దావా కోర్టులో నిల‌వ‌ద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. నాగార్జున ఒకటి చెప్ప‌గా.. సుప్రియ త‌న వాగ్మూలంలో మ‌రొకొటి చెప్పింద‌ని దీంతో కోర్టు నాగార్జున పిటిష‌న్ ను కొట్టేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ విష‌యంపై మంత్రి కొండా సురేఖ త‌ర‌పున న్యాయ‌వాది మీడియాతో మాట్లాడాడు. 

మంత్రి కొండా సురేఖ‌పై సినీ న‌టుడు నాగార్జున దాఖ‌లు చేసిన కేసు నిల‌బ‌డ‌ద‌ని అనుకుంటున్నామ‌ని ఆమె త‌ర‌పున న్యాయ‌వాది పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌లో ముగ్గురు వ్య‌క్తుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయి. నాగార్జున పిటిష‌న్ లో ఒక‌టి చెప్పారు. వాంగ్మూలంలో మ‌రొక‌టి చెప్పారు.  సుప్రియ వాంగ్మూలంలో ఇంకొక‌టి చెప్పారు. సుప్రియను సాక్షిగా కోర్టు ఎంత వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 10న మ‌రొక సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుంది. ఒక‌వేళ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని న్యాయ‌స్థానం మంత్రికి నోటీసులు జారీ చేస్తే దాన్ని న్యాయ‌ప‌రంగానే ఎదుర్కొంటామ‌ని కొండా సురేఖ త‌ర‌పు లాయ‌ర్ చెప్పారు. అయితే, మంత్రి కొండా సురేఖ‌పై కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టుల‌పై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆమె అనుచ‌రులు సిద్ధ‌మ‌య్యారు. మొత్తానికి నాగార్జున‌, కొండా సురేఖ ఎపిషోడ్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డే ప‌రిస్థితులు క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు.