చంద్రబాబు వల్లే జనసేన ఘోర ఓటమి: నాగబాబు

 

ఇటీవల జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన పవన్ సోదరుడు నాగబాబు కూడా వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో జనసేన విఫలం కావడంపై తాజాగా నాగబాబు స్పందించారు. తమ పార్టీ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసినప్పటికీ, ఆ కారణం చేత ప్రజల్లో తమ పార్టీ మీద మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ, చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత తమ పార్టీని దెబ్బ తీసిందని నాగ బాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెప్పుకోదగిన సీట్లు వస్తే తాము చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయనని మళ్లీ సీఎం చేస్తామని ప్రజలు భావించారని నాగబాబు అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన మీద ఎంతగానో విసిగి పోయిన ప్రజలు, చంద్రబాబు కి ఓటు వేయకూడదని నిర్ణయించుకోవడమే కాకుండా జనసేనకు ఓటు వేస్తే ఎక్కడ పొరపాటున చంద్రబాబుకు లాభం చేకూరుతుందో అన్న భయంతో జనసేనకి ఓటు వెయ్యలేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తాము తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీ అన్న విమర్శలను తిప్పి కొట్టాలేకపోవడం జనసేన కు నష్టం చేసింది అని అర్థంమవుతోందని నాగబాబు వ్యాఖ్యానించారు.