ఆవనూనెలోనూ ఆరోగ్యం ఉంది
posted on Feb 10, 2021 9:30AM
భారతీయుల వంటకాల్లో ఆవాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వారి రోజువారీన జీవితంలో ఆవనూనెకీ అంతే ప్రాధాన్యత ఉండేది. పసిపిల్లల ఒంటికి మర్దనా చేయాలన్నా, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలన్నా ఆవనూనెకే తొలి ఓటు వేస్తారు భారతీయులు. ఉత్తరభారతదేశంలో అయితే ఒకప్పుడు వంటనూనెగా సైతం ఆవనూనెను వాడేవారు. ఆవనూనెని ఆహారంగా తీసుకుంటే, ఇందులోని Erucic acid వల్ల దుఫ్పలితాలు వస్తాయని కొన్ని పరిశోధనలు తేలుస్తుంటే, ఆవనూనెలోని Alpha-linolenic acid వల్ల గుండెకు మేలే జరుగుతందని మరికొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా రోజుకొకటిగా వెలువడే పరిశోధనల మాట అటుంచితే... జానపదుల వైద్య విధానంలో అనాదిగా ఆవనూనెను వాడుతూనే ఉన్నారు. వాటిలోంచి కొన్ని ఉపయోగాలు ఇవిగో...
ఒత్తయిన జుట్టు కోసం
ఆవనూనెతో కనుక తలకి మర్దనా చేస్తే జుత్తు నల్లగా ఒత్తుగా పెరుగుతుందంటారు పెద్దలు. ఆవనూనెతో తలకి మసాజ్ చేయడం వల్ల కుదుళ్లలోని రక్తప్రసరణ మెరుగుపడటమే కాదు... ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ, ఇ, కేల్షియంలు జుత్తు ఎదుగుదలకు తోడ్పడతాయి. పైగా ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల అది చుండ్రుని నివారించడంలో తోడ్పడుతుంది.
మిలమిలా మెరిసే పళ్లు
కాస్తంత ఉప్పు, వీలైతే నిమ్మరసం కలిపిన ఆవనూనెతో కనుక పళ్లను, చిగుళ్లను రుద్దితే... పంటి సమస్యలెన్నింటి నుంచో ఉపశమనం లభిస్తుందంటారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, వయసుతో పాటుగా పళ్లు బలహీనపడిపోవడం, గారపట్టడం వంటి సమస్యలన్నీ తీరిపోతాయంటున్నారు.
చర్మానికి
చర్మానికి సంబంధించినంత వరకు, ఆవనూనె అద్భుతాలు చేస్తుండనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆవనూనెతో చర్మాన్ని మర్దనా చేయడం వల్ల స్వేదరంధ్రాలన్నీ శుభ్రపడతాయి. చర్మంలో పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. పైపెచ్చు ఆవనూనెలో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపుని తీసుకువస్తాయి. ఇక శనగపిండి, పెరుగు, నిమ్మరసం వంటివి కలిపిన ఆవనూనెను కనుక చర్మానికి కాసేపు పట్టించి ఉంచితే... ఒంటి మీద ఉన్న నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయన్నది నిపుణుల మాట.
శ్వాసకోశ వ్యాధుల్లో
దగ్గు, జలుబు మొదలుకొని ఆస్తమా, సైనసైటిస్ వంటి అనేక శ్వాసకోశ వ్యాధుల్లో ఆవనూనె ఉపశమనం కలిగిస్తుందన్నది ఓ నమ్మకం. విక్స్ బదులు కర్పూరం కలిపి ఆవనూనెను ఛాతీకి పట్టించడమే మంచిదంటారు. ఇక రోజుకి మూడు స్పూన్లు, తేనె కలిపిన ఆవనూనెను కనుక తీసుకుంటే... కఫం ఇట్టే కరిగిపోతుందంటున్నారు.
జీర్ణం జీర్ణం
కొంతమందికి అసలు ఆకలి వేయనే వేయదు. ఇలాంటివారు కనుక కాస్త ఆవనూనెను పుచ్చుకుంటే, శుభ్రంగా ఆకలి వేస్తుందంటున్నారు పెద్దలు. ఆవనూనెకు మన జీర్ణాశయంలో ఉన్న రసాయనాలను ప్రేరేపించే గుణం ఉండటంతో... ఆకలి వేయడం మొదలుకొని, తిన్న ఆహారం పక్వం కావడం వరకూ అన్ని చర్యలూ సాఫీగా సాగిపోయేలా తోడ్పడుతుంది. అజీర్ణం చేసినవారి పొట్ట మీద కాస్త ఆవనూనెను మర్దనా చేసినా కూడా తగిన ఫలితం కనిపిస్తుంది. ఇంతేకాదు! ఆవనూనె ఓ గొప్ప క్రమిసంహారిణి కూడా. అందుకే శరీరంలోనూ, చర్మం మీదా ఎలాంటి ఇన్ఫెక్షన్లు చోటు చేసుకున్నా కూడా.... వాటిని ఆవనూనె ఇట్టే అరికట్టేస్తుంది. ఆవనూనెతో వెలిగించే దీపం ఆఖరికి దోమలను కూడా తరిమికొడుతుందంటే, దాని ప్రభావం గురించి అంతకంటే రుజువేముంటుంది!
- నిర్జర.