టీఆర్ఎస్‌లోకి ముఖేష్‌గౌడ్?
posted on Jun 29, 2018 11:32AM

ఈసారి ఎన్నికల్లో అయినా ఎలాగొలా కాసిని సీట్లు సంపాదిద్దామనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్లంతా ఒకొక్కరుగా పార్టీని వీడిపోతుంటే క్యాడర్ విలవిల్లాడిపోతోంది. ఈ జాబితాలో గోషామహల్ మాజీ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ కూడా చేరనున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులలో ముందు వరుసలో నిలిచే ముఖేష్ గౌడ్, ఆ పార్టీకి ఇప్పటివరకూ వెన్నుదన్నుగా నిలిచారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. ముఖేష్ కుమారుడు విక్రమ్ కూడా స్థానిక క్యాడర్ మీద మంచి పట్టు సంపాదించాడు. కానీ ఇప్పుడు ముఖేష్ అడుగు తెరాస దిశగా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 1న తన పుట్టినరోజు నాడు ముఖేష్ ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే కనుక నిజమైతే దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ మరో మాస్ లీడర్‌ను కోల్పోయినట్లే!