బదిలీతో సరి.. అంతేనా?

చట్టం ముందు అంతా సమానమే, కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానం.  ఇది ఎప్పటినుంచో  జనం అంటున్న మాట. అనుకుంటున్న మాట. అవును  రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతల  దృష్టిలో చట్టం ముందు అంతా సమానం,.కానీ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు, వ్యవస్థల దృష్టిలో కాదు. ఇప్పడు, ఆ వ్యవస్థల జాబితాలో, న్యాయ వ్యవస్థ కూడా చేరిందా అంటే, ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ,అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తల, ఉదంతం కాదన లేని సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే అభిప్రాయానికి, జస్టిస్ యశ్వంత్‌వర్మ ఉదంతం మరింత బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. అయితే, ఈ ఉదంతంతో సంబంధం లేకుండానే,అనేకమంది ప్రముఖులు న్యాయవ్యవస్థ విశ్వసనీయత విషయంలో చట్ట పరిధిలోనే సందేహాలు వ్యక్త పరిచారు. 

అందుకే న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే ఆవేదన, న్యాయవ్యవస్థ లోపలి నుంచే వ్యక్తమవుతోంది. అవును  ఎవరో కాదు  భారత మాజీ ప్రధాన మూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, ఇటీవల (మార్చి 23) చెన్నైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్న గిల్లుతోందని  అన్నారు. ప్రజల మనసుల్లో నాటుకు పోయిన ఈ భావనను గుర్తించి, పరిష్కారం చూప వలసిన అవసరం ఉందని అన్నారు. 

జస్టిస్ ఎన్వీ రమణ ఈ వాఖ్యలు ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి చేసి ఉండకపోవచ్చును, కానీ ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో, ప్రమాద వశాత్తు బయటపడిన  నోట్ల కట్టల ఉదంతంతో కలిపి చూస్తే  జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్య  మరింతగా అలోచింప చేస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు  గతంలోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూసిన సందర్భాలు లేక పోలేదు. అందుకే  రోజురోజుకూ  న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతూ సమూలంగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాద దిశగా సాగుతోందనే   ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.  

నిజానికి  ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి నివాసంలో దొరికినట్లు చెపుతున్న నోట్ల కట్టల ఉదంతం కంటే, ఇందుకు సంబంధించి, సర్వోన్నత న్యాయస్థానం సహా, ఇతరత్రా వినవస్తున్న వ్యాఖ్యలు, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. 

ముఖ్యంగా  అసలు ఏమి జరిగింది  అనే విషయంలో స్పష్టత లేక పోవడం మొదలు, ఒక న్యాయమూర్తి నివాసంలో అనుమానస్పద నగదు బయట పడిన తర్వాత ఆరేడు రోజుల పాటు ఎటు నుంచి ఎలాంటి  స్పందన లేక పోవడం సహజంగానే పలు అనుమానాలకు ఆస్కారం కల్పించేలా ఉందని అంటున్నారు. అలాగే  న్యాయమూర్తి బదిలీతో’ కేసును క్లోజ్ చేస్తారా? అన్న సందేహాలు వ్యక్త మయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో  న్యాయం జరగడమే కాదు  జరిగినట్లు కనిపించాలి  అనే సహజ సహజ న్యాయ సూత్రం మరుగున పడిపోయిందని, అంటున్నారు. అందుకే  జస్టిస్ వర్మ ఉదంతం చివరకు ఎలా ముగుస్తుంది  అనేది ఆసక్తికరంగా మారింది.  అయితే సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించిన  తర్వాత  తుది ప్రకటన వెలువడనుందని ప్రకటించింది. అంటే కొలీజియం బంతిని,  ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. ఇక ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ఏమి చేస్తుంది? బదిలీతో సరి అంటుందా? చూడాలి.