వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ అఫిడవిట్ లో ఆ ఎంపీ పాత్ర?

మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్న సీబీఐ అధికారులను నిందితులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని సీబీఐ స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు డీ. శివశంకర్ రెడ్డిని 2021 నవంబర్ 18న పులివెందులలోని కోర్టులో హాజరుపరిచినప్పుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో పాటు కోర్టు గదిలోకి ప్రవేశించి, రిమాండ్ లాంఛనాలు పూర్తిచేస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నార’ని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలపడంతో  వివేకా కేసులో మరో సంచలన విషయం బయటపడినట్లైంది.

ఈ హత్య కేసులోని నిందితులు శక్తిమంతులని, సాక్షులను బెదిరిస్తూ విచారణను జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని, అందువల్ల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి,  భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా సీబీఐ వేసిన అఫిడవిట్ లో ఈ విషయం స్పష్టం చేసింది. సీబీఐ విచారణ అధికారులను ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుకున్న వైనాన్ని పూసగుచ్చినట్లుఆ అఫిడవిట్ లో వెల్లడించింది. వివేకా హత్య కేసులోని సాక్షులు, సీబీఐ అధికారులకు ఏపీలో ఎదురవుతున్న బెదిరింపుల దృష్ట్యా అక్కడ విచారణ, దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందనిపించడంలేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.  అందుకే వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలే చేసేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎం ఎం సుందరేశ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘ఆ రోజున అవినాశ్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులను వెంటేసుకుని కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. వివేకా హత్య కేసులో ఏ5 శివశంకర్ రెడ్డికి మద్దతు పలికారు. శివశంకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశావంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు. అక్కడే శివశంకర్ రెడ్డితో కూడా మాట్లాడారు. సీబీఐ బృందం కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో అవినాశ్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో స్పష్టం చేయడం గమనార్హం. ‘శివశంకర్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే అతనిని కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాని గురించి 2021 నవంబర్ 25న పులివెందుల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు.  జైలు అధికారుల తీరును తప్పుపట్టారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో వెల్లడించింది. ‘వివేకా హత్య కేసులో సాక్షి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా.. మరో సాక్షి గంగాధరరెడ్డి కూడా చనిపోయాడు. గంగాధరరెడ్డి మరణాన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు’ అని కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన 278 పేజీల అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం.

సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన అఫిడవిట్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారని స్పష్టంగా పేర్కొనడంతో వివేకా హత్య కేసు వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి మరణం వెనక ఉన్న కీలక సూత్రధారులను బయటపెట్టాలంటూ తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఒక సమాధానం లభించినట్లయిందని అంటున్నారు. తన తండ్రిని దారుణంగా చంపిన, చంపించిన వారిని వదిలిపెట్టేది లేదంటూ సునీతారెడ్డి ఒక విధంగా యుద్ధమే చేస్తున్నారంటున్నారు. మాజీ  సీఎం వైఎస్సార్ కు స్వయంగా తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చడం వెనుక మరిన్ని పెద్ద తలలే ఉన్నాయనే అనుమానాలకు సీబీఐ సుప్రీంలో ఇచ్చిన అఫిడవిట్ మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు.

వివేకా హత్య  వెనుక బలమైన అదృశ్య శక్తులు కీలకంగా ఉన్నందువల్లే సంఘటన జరిగి మూడేళ్లయినా దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటున్నారు. వివేకా హత్య కేసు విచారణ నిష్పాక్షికంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని.. ధర్మాసనం సభ్యుడు జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించడం కూడా కేసు వెనుక ఎంతటి బలమైన శక్తులు పనిచేస్తున్నాయో అర్థం అవుతోందంటున్నారు. నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ఏపీలో కాకుండా ఢిల్లీ, తెలంగాణలలో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని నిందితుల తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu