చంద్రబాబు పతనానికి కారణం చెప్పిన మోత్కుపల్లి..
posted on Aug 29, 2021 2:01PM
తెలుగు దేశం పార్టీలో చాలా కాలం పని చేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి... ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2018లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు మోత్కుపల్లి. సీఎం కేసీఆర్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ ను ప్రశంసిస్తూ వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. దళిత బంధుపై ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతల తీరును తప్పుపడుతున్నారు నర్సింహులు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా, దళిత బంధుకు, సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఆదివారం తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు మోత్కుపల్లి నర్సింహులు.
దీక్ష సందర్భంగా దళిత బంధు పథకంతో పాటు విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. తెలంగాణలో దళితబంధు పథకం.. వంద శాతం అమలు కాకపోతే యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకాన్ని వంద శాతం అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మాటల్లో నిజాయితీ కనిపించిందని చెప్పారు. సీఎం ప్రకటించినట్లే చేస్తారనే నమ్మకం తనకు ఉందని.. ఒకవేళ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.దళితుల సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్.. మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
తెలుగు దేశం పార్టీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబు నాశనమయ్యారని చెప్పారు. రేవంత్ జీవితమంతా మోసాలు, బ్లాక్ మెయిలింగే అని విమర్శించారు నర్సింహులు. ఆర్టీఐని వాడుకుని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. దళితులు కులవివక్షకు గురై మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. వారివి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులని చెప్పారు. గ్రామాల్లో దళితులు గతంలో రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోందన్నారు మోత్కుపల్లి.
ఒక పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకానికి మద్దతు ఇవ్వడం.. సాహసోపేతమైన నిర్ణయమని తెలిపారు నర్సింహులు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా పని చేసినా.. దళితుల కోసం ఎవరూ స్పందించలేదని చెప్పారు. దళితుల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అంతా అంటున్నారని తెలిపారు. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తామని మోత్కుపల్లి స్పష్టం చేశారు.