కోతికి పెళ్లి సరదా!
posted on Feb 13, 2023 8:50AM
వివాహ వేడుక పై ఓ కోతికి సరదా పుట్టింది. పెళ్లి తంతును ఎన్నిసార్లు గమనించిందో ఏమో.. అత్యంత ముఖ్యమైనది ముహూర్త సమయానికి పెళ్లి కూతురూ, పెళ్లి కొడుకూ ఒకరి తలపై ఒకరు పెట్టుకుని జీలకర్రా బెల్లంకు ఉన్న ప్రాముఖ్యత అర్దమైంది.
అందుకే ఆ కోతి పెళ్లి కొడుకు తలపై పెళ్లి కూతురు తీసుకు వెళ్లిన జీలకర్రా బెల్లాన్ని అపహరించుకుపోయింది. నిజమే.. నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఆ కోతి కొంటెతనం అర్ధమౌతుంది. ఎక్కడ జరిగింది..
ఎప్పుడు జరిగింది అన్నది తెలియలేదు కానీ.. పెళ్లి సందడిలో ఓ కోతి ప్రత్యక్షమైంది. తలంబ్రాలు పోసుకుంటున్న నవదంపతుల వద్దకు వెళ్లింది. వారి తలపై ఉన్న జీలకర్ర బెల్లం ఎత్తుకుని ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోయింది. అందరూ ఒక్క క్షణం నిర్ఘాంత పోయినా వెంటనే తేరుకుని హాయిగా నవ్వుకున్నారు. ఆ కోతి కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటోందని వ్యాఖ్యలు చేశారు.