చిరంజీవి మీద కాదు: మోహన్ బాబు

 

సినీ నటుడు మోహన్ బాబు త్వరలో రాజకీయాలలోకి ప్రవేశిస్తానని ప్రకటన చేస్తూ "పార్టీ పెట్టే దైర్యం, దానిని అమ్ముకొనే తెలివితేటలు తనకి లేవంటూ" వ్యంగంగా అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నావో అందరికీ తెలుసు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ “నేను చిరంజీవిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదు. ఆయన కుటుంబంతో మా కుటుంబానికి సత్సంబందాలున్నాయి. పర్యాటక మంత్రిగా ఆయన చాలానే చేస్తున్నాడు. అందుకు ఆయనను అభినందిస్తున్నాను,” అని అన్నారు.

 

కానీ, ఆయన మళ్ళీ అప్పుడే మరో కొత్త బాణం వేసారు. “డబ్బులు ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకొన్న వాళ్ళు గుట్టుగానే తీసుకొన్నారు. ఇద్దరూ బాగానే ఉన్నారిప్పుడు. వాళ్ళెవరో అందరికి తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు,” అని అన్నారు.

 

బహుశః ఆయన ఈ సారి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, కాంగ్రెస్ హై కమాండ్ ని ఉద్దేశించి ఈ విధంగా అని ఉండవచ్చును. గతంలో రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తున్నందుకు గాను, ఆయన ప్రతీనెలా కాంగ్రెస్ హైకమాండ్ కి కప్పం (పన్ను) కట్టినట్లు సూట్ కేసులతో డబ్బు ముట్టజెప్పేవారని, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించేవారు. బహుశః ఆయన వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈవిదంగా అని ఉండవచ్చును.

 

ఏమయినప్పటికీ, ఆయన తీరు, మాటలు రెండూ కూడా అయన రాజకీయాలకు నప్పరని స్పష్టం చేస్తోంది. రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందుకు తగిన విధంగా మాట్లాడకపోగా, ఇటువంటి వ్యర్ధమయిన వ్యంగోక్తులు ప్రయోగించడం ఆయనకు ఏవిధంగాను మేలు చేయకపోగా, ముందుగానే రాజకీయ శత్రువులను సృష్టించిపెడుతుంది అని ఆయన గ్రహించడం మంచిది. ఇటువంటి డైలాగులకి సినిమాలలో బాగానే చప్పట్లు పడవచ్చును, కానీ రాజకీయాలలో మాత్రం అవి అనర్ధాలే తెస్తాయి. ఆయన తన మాటలకి స్వయంగా మళ్ళీ సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణ.