టిటిడి మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కన్నుమూత
posted on Apr 25, 2013 9:38AM
ప్రముఖ పారిశ్రామికవేత్త ,చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కన్నుమూశారు. కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్న ఆదికేశవులు బుధవారం రాత్రి 10.15 గంటలకు తన సొంత ఆస్పత్రి వైదేహిలో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యసాయిబాబాకు పరమ భక్తుడైన ఆదికేశవులు నాయుడు సత్యసాయి శివైక్యం చెందిన రెండేళ్లకు సరిగ్గా అదే రోజున మరణించడం గమనార్హం. వైదేహి ఆస్పత్రి ప్రాంగణంలోనే గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆదికేశవులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ వర్గాల ద్వారా తెలిసింది.
ఆదికేశవులు మృతిపై సీఎం కిరణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌గా, ఎంపీగా, పారిశ్రామికవేత్తగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు ఆదికేశవులు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. ఆదికేశవులు ఆకస్మిక మృతి తనను షాక్‌కు గురి చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఉండగానే ఆదికేశవులు కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు.