కాంగ్రెస్ పై మోహన్ బాబు విమర్శనాస్త్రాలు
posted on Apr 25, 2013 10:03AM
నటుడు మోహన్ బాబు మరోసారి వార్తల్లోకి వచ్చారు. తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్న ప్రకటనతో చర్చలోకి వచ్చిన మోహన్ బాబు ఇప్పడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడటంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే మోహన్ బాబు విమర్శ ఇప్పుడు రాజకీయ కోణంలో కాక ఒక కళాశాల యజమాని తీరున ఉంది. శ్రీ విద్యానికేతన్ సంస్థల యజమానికిగా ఒక ఇంజినీరింగ్ కళా శాల యజామానికిగా ప్రభుత్వంపై మోహన్ బాబు విమర్శనాస్త్రాలు సంధించారు. తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మొత్తం కాలేజీల తరపున వకాల్తా పుచ్చుకొంటూ… రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో 730 ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలకాకపోవడంతో లెక్చరర్లకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే అనేక సార్లు కళాశాలల తరపున మోహన్ బాబు ప్రభుత్వంతో చర్చల్లోపాల్గొన్నారు. అయితే అవేవీ సానుకూలంగా కనపడకపోవడంతో ఇప్పుడు ఈయన విమర్శలకు దిగారు. ఇక ఇతర అంశాల గురించి కూడా మోహన్ బాబు స్పందించారు. రాజకీయపార్టీల తీరువల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విదేశీ తరహాలో ఇక్కడా కఠిన శిక్షలు అమలుచేస్తే అత్యాచారాలు ఉండవన్నారు.