వ్యవస్థలపై పెత్తనమే లక్ష్యంగా మోడీ సర్కార్!

విపక్షాల భయాలే నిజమౌతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోడీ సర్కార్ గుప్పెట్లో పెట్టుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అయిపోయింది. ఇందు కోసం సుప్రీం కోర్టు  తీర్పునకు భిన్నంగా బిల్లు రెడీ చేసింది. గురువారం (ఆగస్టు 10) రాజ్యసభలో ప్రవేశ పెట్టేసింది కూడా. ఈ బిల్లు ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం పట్టును, జోక్యాన్ని పెంచేదిగా ఉంది. ఎంపిక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేసే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ పంజరంలో చిలుకలా కేంద్రం చేతిలో  కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు కనుక సభ ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అంటే 2019 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవీఎంల నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసుల వరకూ అన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని విపక్షాలు ఆరోపించాయి. ఆ తరువాత కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ప్రతి అంశమూ కూడా మోడీ కనుసన్నలలో జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని లాగేసుకుని తానే ఆధిపత్యం చెలాయించాలని  చూస్తున్నదన్న విపక్షాల ఆరోపణలు అక్షర సత్యాలేననడానికి కేంద్రం తాజాగా లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు రుజువు చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

2012లోనే బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వాని అప్పటి ప్రధానికి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి  చోటు కల్పించాలని కోరుతూ లేఖ రాశారు. ఇక ఈ ఏడాది మార్చిలో దేశ సర్వోన్నత న్యాయస్థానం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంపై విస్ఫష్ట తీర్పు ఇచ్చింది. ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాలు జరపాలని స్పష్టంగా పేర్కొంది. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం గురువారం(ఆగస్టు 10) రాజ్యసభలో  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా ఆ స్థానంలో ప్రధాని ఎంపిక చేసే కేంద్ర మంత్రికి స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లును  ప్రవేశపెట్టింది.

ఈ బిల్లు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో  ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, ప్రధాని ఎంపిక చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ  ఎన్నికల కమిషనర్లుగా నియమించేందుకు అర్హత ఉన్న ఐదుగురిని ఎంపిక చేస్తుంది. వారిలో నుంచి ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, కమిషనర్లను ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. అదీ సంగతి. 

ఇప్పటికే కేంద్రం ఆడించినట్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటి  దాడులు ఏ లక్ష్యంతో ఎవరిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నాయో అందరికీ తెలుసుననీ, ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయనీ, ఇక ఈ బిల్లు ప్రవేశ పెట్టడంతో కేంద్రం అవన్నీ ఆరోపణలు కావు, అక్షర సత్యాలని తేల్చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వ వ్యవస్థలపైనా పెత్తనం చెలాయించి అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్రలో భాగమే ఈ బిల్లు అని కాంగ్రెస్ విమర్శించింది.

అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇది న్యాయపరీక్షకు నిలబడదని అంటున్నారు. మొత్తం మీద కేంద్రం తీసుకువచ్చిన బిల్లు మాత్రం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించేలా మోడీ సర్కార్ చట్టాలను రూపొందిస్తోందనీ, మంద బలంతో వాటిని సభలో ఆమోదింప చేసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.