ఆ నలుగురు.. ఏం చేస్తారు?

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీదే హవా. అటు గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి ఇటు పార్లమెంట్ ఎన్నికల వరకూ అధికార పార్టీ జెండ రెపరెపలాడాల్సిందే. అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం విపక్ష తెలుగుదేశం పార్టీని వరించింది. దీంతో విజయం కోసం ఎన్ని జిమ్మిక్కులు చేసినా..  సైకిల్ జోరు ముందు నిలవలేకపోవడం. అధికార ఫ్యాన్ పార్టీలోని అధినేత నుంచి అగ్రనేతల వరకు ఎవరికీ ఏ మాత్రం మింగుడు పడటం లేదు.   

 ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్ రెడ్డి  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ఆయన అధ్యక్షతన జరుగుతోన్న వివిధ సమీక్ష సమావేశాల్లో పార్టీ శ్రేణులకు స్పష్టం చెబుతూ వస్తున్నారు. తాజాగా మార్చి 14న జరిగిన కేబినెట్‌ భేటీలో సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ.. మన పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోవాలని..  అలా కానీ పక్షంలో మంత్రివర్గంలో మార్పులు.. చేర్పులు.. తథ్యం అంటూ విస్పష్టంగా చెప్పారు.   

అలాంటి వేళ.. ఇలా జరగడం ఏమిటనే ఓ సందేహం వైసీపీ శ్రేణులను తొలిచేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే.. పార్టీ పరిస్థితే కాదు..  తమ పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు మధనపడుతున్నారు 

మరోవైపు గత ఎన్నికల్లో  తెలుగుదేశం నుంచి గెలిచి..  ఆ తర్వాత వైసీపీలోకి  జంప్  చేసిన లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరాంల.. పరిస్థితి ఏమిటనే ఓ చర్చ జగన్ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.  

ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరిన పలువురు మ్మెల్యేలను... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు..  తన కేబినెట్‌లోకి తీసుకొని.. కీలక మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు.  ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే  జగన్ తమకు  గోల్డెన్ ఆఫర్ ఇస్తారని భావించారనీ,  అయితే వారొకటి తలిస్తే.. జగన్ మరోకటి తలచి తమను పదవులకు దూరంగా పెట్టారనీ అంటున్నారు.  

అయితే ఈ నలుగురు.... వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ తరుఫున పోటీ చేస్తారా? ఆ క్రమంలో వీరికి సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటే సందేహమేనని.. పోనీ వీరు తిరిగి సొంత గూటికి అంటే...  తెలుగుదేశం గూటికి చేరుతారా? ఒక వేళ చేరాలనుకున్నా ఆ పార్టీ అధినేత రానిస్తారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే.. ఇప్పటికీ వీరు అసెంబ్లీలో టీడీపీ సభ్యులుగానే చెలామణి అవుతున్నారు. 

మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల బరిలో దింపారు. ఈ ఎన్నిక మార్చి 23న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓటు వేయాలని ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు 23 మందికీ ఆ పార్టీ వీప్ జారీ చేసింది. ఆ 23 మందిలో  ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి వీరు పంచుమర్తి అనురాధకు అనుకూలంగా   ఓటు వేసి... తాము సైకిల్ పార్టీతోనే ఉన్నామని చెప్పకనే చెబుతారా?  లేకుంటే సీఎం జగన్‌కి రుణ పడి ఉన్నామంటూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వేళ.. పోలింగ్‌కు గైర్హాజరవుతారా? అనేది వేచి చూడాలని చర్చ సైతం నడుస్తోంది. 

ఇప్పటికే జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ... అది పట్టభద్ర  ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైందనీ,  అలాంటి వేళ.. ఈ నలుగురు ఆచి తూచి అడుగులు వేస్తారనీ భావిస్తున్నారు.