పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నామన్న బాలినేని

కొంచం ఆలస్యంగానైనా వైసీపీకి వాస్తవం బోధపడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా మాట్లాడిన వారంతా పట్టభద్రులు మా ఓటర్లు కాదు, సమాజంలో వారు చిన్న సెక్షన్ మాత్రమే అంటూ వచ్చారు. కానీ తొలి సారిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ కు బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల్లో, ఉపాధ్యాయుల్లో మా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని అంగీకరించారు.  

అయితే అంత మాత్రాన తెలుగుదేశం సంబరాలు చేసేసుకోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు.  పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని,  ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో అర్థమయిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఓటర్లలో వీరు కేవలం రెండు శాతం మాత్రమేననీ, అయినా ఓ మూడు  ఎమ్మెల్సీ సీట్లకే రాష్ట్రంలో అధికారం చేపట్టేసినట్లు  టీడీపీ నేతలు సంబరపడిపోవడం హాస్యాస్పదంగా ఉందని బాలినేని ఎద్దేవా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.