మల్లాడి మరో హైడ్రామా
posted on Oct 3, 2012 11:19AM
.png)
ప్రతీసారి అవకాశం ఎప్పుడు దొరుకతుందా అని ఎదురుచూసే కేంద్రపాలితప్రాంతమైన యానాం శాసనసభ్యుడు మల్లాడికృష్ణారావు రాజీనామా ద్వారా హైడ్రామాకు తెరలేపారు. తాను యానాం అభివృద్థి కోసం 8 డిమాండ్లు నెరవేర్చాలని కోరితే పుదుచ్ఛేరి సిఎం రంగస్వామి స్పందించనందుకు నిరసనగా తాను ఈ రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను న్యూఢల్లీ నుంచి పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. ఈ రాజీనామా ద్వారా యానాంలో తిరిగి తమ కోసం ఎమ్మెల్యే పదవిని కృష్ణారావు వదులుకున్నారన్న ప్రచారం ఆల్‌రెడీ ప్రారంభమైపోయింది. ఈ ప్రచారంతో యానాం ఓటర్లు ఎన్నికల కోసం మళ్లీ ఎదురుచూస్తారు. ఎన్నికలు రాగానే కృష్ణారావుకు ఓటేస్తారు. దీంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై అధికారపార్టీపై పెత్తనం చెలాయిస్తారు. ప్రతీసారి అధికారపార్టీపై తన అధికారం చూపే అవకాశం వెదుక్కునే కృష్ణారావు అనుకోకుండా ఈసారి ప్రతిపక్షంలో ఉండిపోయారు. ప్రజలు ఎన్నుకుంటే తాను వదులుకున్నా ఓటర్లు గెలిపించుకున్నారని అధికారపార్టీపై కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందిన తీరు పరిశీలిస్తే ఆయన ఇంట్లో నుంచి రూపాయి తీయకుండా నేను కావాలనుకుంటే గెలిపించుకోండి, నాకు పదవీవ్యామోహం లేదు, నేను పేదవాడిని, గెలిపిస్తే మాత్రం సేవ చేసుకుంటానని మల్లాడి మౌనం వహించారు. ప్రచారం వదిలేసి ఇంట్లోనే ఉండిపోయిన మల్లాడిని యానాం ఓటర్లు గెలిపించుకున్నారు. ఇలాంటి హైడ్రామాలు ఆడటంలో అనుభవమున్న మల్లాడి మళ్లీ తెరపై తన హంగామాను మొదలుపెట్టారు. స్పీకర్ రాజీనామా ఆమోదిస్తే ఒకరకంగానూ, ఆమోదించకపోతే మరో రకంగానూ మల్లాడి మాట్లాడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిఎంకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలను చేరదీసిన మల్లాడి అంత అకస్మాత్తుగా రాజీనామా చేశారంటే ఆలోచించాల్సిన విషయమేనని రాజకీయపరిశీలకులు అంటున్నారు.