మైనర్ల సహజీవనం!
posted on Jan 5, 2026 1:11PM

ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న ఉదంతం హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేయడం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు చెందిన మైనర్లైన అబ్బాయి, అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఆ ఇద్దరినీ మందలించి.. కౌన్సెలింగ్ చేసి.. ముందు చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ తరువాత తామే వారిరువురికీ వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగం లోకి దిగి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో.. నిబంధనల మేరకు వారిని శిశువిహార్‌కు తరలించారు. బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని, మైనర్ల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు మైనర్ల సహజీవనం ఉదంతం నగరంలో కలకలం రేపింది. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు.