మంత్రి పువ్వాడకు ఉద్వాసన తప్పదా? సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలో హై కోర్ట్ నోటీసు

ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్’కు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదా? అందుకేనా, ఇప్పుడు ఆయనకు తమ సామాజిక మూలాలు గుర్తుకు వచ్చాయా? అందుకేనా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాలలోని కమ్మ సామాజికవర్గమంతా రాజకీయాలు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారా? అంటే, అవుననే అవుననే సమాధానమే వస్తోంది. 
ఖమ్మం జిల్లాలో మంత్రి ఆగడాలు మితిమీరిపోయాయని చాలా కాలంగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసేఆర్ అంతగా పట్టించుకోలేదు. నిజానికి ఖమ్మంలో పువ్వాడ అజయ్ నేనే రాజు, నేనే మంత్రి అనేవిధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలే కాదు స్వపక్షంలోనో ఆయన వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇష్టారీతిన అందరిపై కేసులు పెట్టి వేధించారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా పోస్టులపైనా కేసులు పెట్టి పోలీసులతో కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ను అలాగే వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా సాయి గ‌ణేశ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాట ఇవ్వడతో పాటుగా. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు గవర్నర్’ను కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతో పోలీసులు వేధింపులకు గురిచేయడం వల్లనే సాయి గ‌ణేశ్ ఆత్మహత్య చేసుకున్నారని, ఫిర్యాదు చేశారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
అదలా ఉంటే, సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలో మంత్రి పువ్వాడ అజ‌య్‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఆ నోటీసుల‌కు స్పందించాల‌ని హైకోర్టు పేర్కొంది. ఈ మేర‌కు సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. 
అధికార టీఆర్ఎస్ నేత‌ల ప్రోత్సాహంతో పోలీసులు త‌న‌పై కేసులు న‌మోదు చేసి వేధిస్తున్నార‌ని చెబుతూ సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌కు దారితీసిన కార‌ణాల‌ను వెలికితీయ‌డంతో పాటు అందుకు బాధ్యులెవ‌ర‌నే విష‌యంపైనా నిజాల‌ను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచార‌ణకు ఆదేశాలు ఇవ్వాల‌ని బీజేపీ నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.దీనిపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది . పువ్వడంతో పాటు ఖమ్మం త్రి టౌన్ , టూటౌన్ ఎస్ ఎచ్ ఓ లకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు . 
ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందన్నఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు ఘోరాల వెనక,అధికార తెరాస నేతల హస్త ముందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర హై కోర్టు కూడా మంత్రి పువ్వాడ అజయ్ కు నోటీసు సర్వ్ చేసినందున, డ్యామేజి కంట్రోల్ కోసమైనా ముఖ్యమంత్రి పువ్వాడకు ఉద్వాసన చెపుతారని అంటున్నారు. 
ఈ నేపధ్యంలోనే మంత్రి పువ్వాడ అజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గమంతా రాజకీయాలు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర ప్రదేశ్’లో తమ సామాజిక వర్గానికి చెందినా ఒకే ఒక్క మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించారని అన్నారు.ఇక్కడ తనను కూడా తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే,  ఇప్పుడు తమ మంత్రి పదవికి ముప్పు రావడం వల్లనే ఆయనకు సామాజిక మూలాలు గుర్తుకు వచ్చాయని, అంటున్నారు.