వైఎస్ కుటుంబ వివాదం.. కేవీపీ మౌనం.. ఎవరికి లాభం?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన నిస్సందేహంగా వైఎస్ కుటుంబ పరువును బజారున పడేంది.  ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని అంటారు.  జగన్,షర్మిల విషయంలో  అదే జరుగుతోంది.  ఆస్తుల  విభేదాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబం లోని లొసుగులన్నీ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో బయటపడి వైఎస్ కుటుంబం నవ్వుల పాలౌతోంది.  జగన్, షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం కంటే ఆస్తి గొడవలే పెద్ద పీట వేసుకు కూర్చున్నాయి.  

అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజా సానుభూతి షర్మిల వైపే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను గద్దెనెక్కడం కోసం చెల్లెలు కాళ్లరిగేలా చేసిన పాదయాత్ర, తాను జైలులో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపించిన వైనం గుర్తు చేసుకుంటూ పబ్బం గడిచిన తరువాత జగన్ షర్మిలను పార్టీ నుంచి పంపేశారనీ, తల్లిని సైతం అమర్యాదగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయించి పంపేరనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాలో జగన్ రాజకీయం కూడా ప్రస్తావనకు, చర్చకు వస్తున్నది. అది పక్కన పెడితే తన తరఫు వాదనను షర్మిల మాత్రమే వినిపిస్తుండగా జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని వైసీపీ నేతలు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ వివాదంలో వైఎస్ కుటుంబ బంధువు వైవీ సుబ్బారెడ్డి, వారి కుటుంబానికి సన్నిహితుడు విజయసాయి రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి షర్మిల అవాస్తవాలు చెబుతున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంకో అడుగు ముందుకు ముందుకు వేసి చంద్రబాబుకు అనుకూలంగా షర్మిల మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. 

అయితే ఈ తరుణంలో వైఎస్ విజయమ్మ రంగ ప్రవేశం చేసి  షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖ రాయడంతో వైసీపీ నేతల విమర్శలను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. అయినా షర్మిలకు జగన్ అన్యాయం చేశారనే మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. అయితే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ ఆత్మగా అందరూ భావించే కేవీపీ రామచంద్రరావు షర్మిల, జగన్ ఆస్తుల వివాదం విషయంలో నోరు మెదపకపోవడం గమనార్హం. 

వైఎస్ బతికి ఉండగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ ప్రత్యక్ష సాక్షి కేవీపీ రామచంద్రరావు. వైఎస్ షర్మిలకు కుటుంబ ఆస్తులలో సమాన వాటా ఇవ్వాలని భావించారా లేదా అన్న విషయాన్ని సాధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి కేవీపీ మాత్రమే. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని పెట్టుకున్నా కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయినా జగన్ శ్రేయోభిలాషిననే ఆయన చెప్పుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనపై ఆయన గట్టిగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ, కేవీపీ ఆమో పక్కన పెద్దగా కనిపించిందీ లేదు. మద్దతు పలికిందీ లేదు. అందుకే షర్మిల, జగన్ ఆస్తుల వివాదంలో కేవీపీ ఏం మాట్లాడినా ఇంపార్షియల్ గా ఉంటుందని జనం భావిస్తారు. ఆయన కనుక నోరు తెరిచి షర్మిలకు సమాన వాటా ఇవ్వాలని వైఎస్ భావించారన్న మాట చెబితే ఇక జగన్ రాజకీయ భవిష్యత్ కు ఎండ కార్డ్ పడినట్లునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.