భక్తి, బాధ్యత లేని టీటీడీ...తిరుమల కొండపై సినిమా పాటల ప్రసారం
posted on Apr 23, 2022 5:58AM
వైకాపా పాలనలో తిరుమల పవిత్రత, ప్రతిష్ట మంటగలుస్తున్నాయి. వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలు భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. భక్తుల సేవలో తరించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పని మానేసి అనవసర రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. తిరుమల రద్దీ అంటూ భక్తులకు కొండ మీదకు రావడంపై నిషేధం విధించడం నుంచీ ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లలో తొక్కిస లాట వరకూ ఏ సంఘటన తీసుకున్నా టీటీడీ నిర్లక్ష్యం, నిర్వహణా సామర్ధ్య లోపం కనిపిస్తాయి.
తాజాగా నిత్య గోవింద నామస్మరణతో అలరారాల్సిన తిరుమల గిరిపై సినిమా పాటలు వినిపించాయి. అదికూడా సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపైనే. శుక్రవారం సాయంత్రం దాదాపు ఒక అరగంట పాటు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారం కావడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.
నిత్యం గోవింద నామస్మరణ,భక్తి గీతాలతో మార్మోగే తిరుమల గిరులపై సినిమా పాటల ప్రసారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెరపై ఓ వైపు సినిమా పాటల దృశ్యాలు, బ్యాక్ డ్రాప్‌లో గోవింద నామాలు ప్రసారం ప్రసారమ్యాయి.ఇది టీటీడీ నిర్లక్ష్యానికీ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెట్ టాప్ బాక్స్ వైఫల్యం వల్లే టీటీడీ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమాపాటల ప్రసారం జరిగిందనీ, వెంటనే సరిచేశామని టీటీడీ ఈవో వివరణ భక్తుల ఆగ్రహాగ్నిని ఏ మాత్రం చల్లార్చ లేకపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా జరుగుతున్న సంఘటనల వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.