మరోసారి లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్...తప్పుడు రాతలపై పరువునష్టం దావా

 

జగన్ మీడియా తప్పుడు రాతలపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ 7వ తేదీన (బుధవారం) హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్స్‌ పూర్తికాగా, 3వ సారి లోకేష్‌ హాజరవుతున్నారు. చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` శీర్షికతో 2019, అక్టోబర్‌ 22న జగన్ మీడియాలో అసత్యాలు, కల్పితాలతో ఓ కథనం ప్రచురించారు. అవాస్తవాలతో, ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన న్యాయవాదుల ద్వారా  ఆపత్రికకి రిజిస్టర్‌ నోటీసు పంపించారు. 

అయినప్పటికీ జగన్ మీడియా  ఎటువంటి సహేతుకమైన సమాధానం ఇవ్వనందున  లోకేష్‌ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం ప్రచురించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని  ప్రచురించిన తేదీల్లో అసలు విశాఖలోనే లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్‌ పోర్ట్‌లో ఎటువంటి ప్రొటోకాల్‌ సౌకర్యాలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి లోకేష్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు, ఎస్వీ రమణ హాజరవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu