ఏపీలో పోటా పోటీ విగ్రహాలు..?
posted on Jan 13, 2026 2:54PM

ఏపీలో కొండలపై పోటా పోటీ విగ్రహాల గురించి ప్రముఖంగా చర్చ నడుస్తోంది. కూటమి సర్కార్ కమ్మ వారు అధికంగా ఉండే నీరుకొండ గ్రామం కొండపై రూ. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడతామన్న ప్రకటన చేసింది. దీంతో వైయస్, రంగా విగ్రహాల ప్రస్తావన సైతం విన వస్తోంది. కమ్మలను చూసిన రెడ్లు.. తాము ఎక్కువగా ఉండే పెనుమాక గ్రామం కొండపై వైయస్ విగ్రహం అంతకన్నా మించిన ఎత్తుతో,, సుమారు మూడు వేల కోట్ల వ్యయం చేస్తూ.. విగ్రహం పెట్టడం ఖాయంగా తెలుస్తోంది.ఇక కమ్మ, రెడ్లను చూసి కాపులు తామేమీ తక్కువ కాదంటున్నారట. కాపులు ఎక్కువగా ఉండే ఉండవల్లి గ్రామం కొండ లేదా ఎర్రుపాలెం కొండపై వంగవీటి మోహన రంగా విగ్రహం పెడతారట.
దీంతో ఏపీలో ప్రస్తుతం పోటా పోటీ విగ్రహాల వ్యవహారం ఒకింత జోరుగానే సాగుతోంది. కొందరు కమ్మ వారైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని వద్దనే అంటున్నారట. కారణం ఇదిగో ఇదేనంటున్నారు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడితే.. వచ్చే రోజుల్లో అవి వైయస్, రంగా విగ్రహాలుగా ఒకటికి మూడవుతాయని వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారట. ఉన్న సమస్యలు చాలవన్నట్టు వైసీపీ ఇదే విగ్రహ వ్యవహారంపై కొత్త రాగం అందుకుంది.
మెడికల్ కాలేజీలకు ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేని కూటమి సర్కార్.. సుమారు రెండు వేల కోట్లతో ఈ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడమేంటని రివర్స్ లో వస్తోంది. దీంతో పాటు దళితులను కూడా ఎగదోసి.. మా సొమ్ముతో కమ్మ వారి కుల ప్రతీక అయిన ఎన్టీఆర్ విగ్రహం పెట్టడమేంటని ఒక రకమైన ప్రచారం చేయిస్తోంది. కొందరైతే కమ్మవారికి ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టుకునేంత సొమ్ములు కూడా లేవా? అన్న చర్చకు తెరలేపారు. ఇదంతా ఇలా ఉంటే గతంలో గుంటూరు ఎంపీ గా పని చేసిన జయదేవ్ గల్లా పార్లమెంటులో బీజేపీ సర్కార్ వేల కోట్లతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, శివాజీ విగ్రహాల వీడియోని వైరల్ చేస్తున్నారు. వీటన్నిటి నడుమ ఈ విగ్రహాల వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుందో తేలాల్సి ఉంది.