తెలుగు రాష్ట్రాలలో నేడూ వర్షాలు

తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం (ఏఫ్రిల్ 4)   భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు తెలంగాణలో  వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని   అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.  కాగా గురువారం (ఏప్రిల్ 3) తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ అకాల వానల కారణంగా అన్నదాతలకు భారీ నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. 

గురువారం (ఏప్రిల్ 3)తెలంగాణలోని పలు జిల్లాలు వడగళ్ల వాన, పిడుగుపాటుతో కూడిన అకాల వర్షం అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా ప్రాణనష్టంతో పాటు పంట నష్టం కూడా సంభవించింది.  పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో ముగ్గురు మరణించారు.  నాగర్ కర్నూల్ జిల్లాలోని పదర్ మండలంలో, పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు  నిజామాబాద్‌లో ఒకరు పిడుగుపాటు కారణంగా మరణించారు.

అలాగే  జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మాచర్ల గ్రామంలో, వడగళ్ల వానకు రెండు పశువులు చనిపోయాయి. పలు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.  ఇటిక్యాల మండలంలోని రావుల చెరువు గ్రామంలో 55 ఎకరాల్లో మామిడి పంట  దెబ్బతింది. ఉండవెల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.