వాడిన మల్లికి సెల్యూట్



ప్రపంచంలోని అనేక పర్వత శిఖరాల మీద పరిమళించిన భారతీయ మల్లి వాడిపోయింది. భారతీయ పరిమళాన్ని పరాయి దేశపు పర్వతాన్ని ఎక్కి వెదజల్లాలని ప్రయత్నించిన ఆ మల్లి ఆ పర్వతం మీదే రాలిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు చివరికి నెల్లూరు జిల్లాలోని తన సొంత గ్రామం గాంధీ జన సంగంలో శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు. శనివారం నాడు జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులతోపాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా హాజరై మస్తాన్‌బాబుకు నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపించారు. మల్లి మస్తాన్ బాబు మరణించాక ఆయనకు ఈ స్థాయి గౌరవం దక్కింది..

అయితే ఆయన జీవించి వున్నంత వరకు ఆయన్ని పట్టించుకున్నవారు ఎవరైనా వున్నారా? ప్రభుత్వాలు పట్టించుకున్నాయా? మీడియా పట్టించుకుందా? ఏసీ గదిలో కూర్చుని లక్షల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగం పొందే విద్యార్హతలు ఎన్నో ఉన్నప్పటికీ, పర్వతారోహణ అనే విలక్షణ మార్గాన్ని ఎంచుకున్న మల్లి మస్తాన్ బాబు... ఏ దేశంలో ఏ పర్వత శిఖరాన్ని అధిరోహించినా తన వెంట భారత జాతీయ పతాకాన్ని వెంట తీసుకుని వెళ్ళేవాడు. పర్వత శిఖరాన్ని చేరుకున్న తర్వాత త్రివర్ణ పతకాన్ని ఆ శిఖరం మీద రెపరెపలాడించి, చిరునవ్వుతో ఆ పతాకానికి సెల్యూట్ చేసేవాడు.  ఆదాయం గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా, తాను తడికలతో కట్టిన ఇంట్లో వుంటూనే, దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేశాడు. అనేక దేశాల్లో పర్వత శిఖరాల మీద రెపరెపలాడుతున్న భారత జాతీయ పతాకాన్ని అందరూ తలెత్తి చూసేలా చేశాడు. ఇంత చేసినా ఏమీ ఆశించని మస్తాన్ బాబు త్యాగాన్ని ఆయన జీవించినంతవరకూ గుర్తించినవారు ఎవరైనా వున్నారా?

ఈ దేశ దౌర్భాగ్యం క్రికెట్ తప్ప మరొకటి క్రీడే కాదు... క్రికెటర్ తప్ప మరొకడు మనిషే కాదు. ఒక తెడ్డు పుచ్చుకుని బంతిని కొట్టి వ్యక్తిగత ప్రతిష్ఠను, ఆదాయాన్ని పెంచుకునే వ్యక్తులకు  ఎన్ని ఉన్నత అవార్డులైనా ఇస్తారు. ఫిక్సింగ్ చేసిన ఓ పెద్దమనిషిని కూడా ఎంపీగా పార్లమెంట్‌కి పంపించిన పెద్దమనసులు మనవి. క్రికెట్ పేరు చెబితే ప్రేమ పొంగిపొర్లే మన జనాలకి మిగతా క్రీడలు, మిగతా సాహసాలను గుర్తించే తీరిక ఓపిక లేకపోవడం బాధాకరం. మల్లి మస్తాన్ బాబు పర్వతారోహకుడిగా చేసిన సాహసాలు తక్కువేమీ కాదు... చాలామంది ఊహించడానికి కూడా భయపడే సాహసాలను ఆయన చేశాడు. సాహసిగానే తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. పర్వతారోహకుడిగా ప్రాణాలు పోగొట్టుకుంటే తాను చాలా సంతోషిస్తానని చెప్పే ఆయన చివరికి తాను కోరుకున్నట్టే వెళ్ళిపోయాడు. మస్తాన్ బాబు ప్రాణాలు మాత్రమే పోయాయి... ఆయన ఇచ్చిన స్ఫూర్తికి మాత్రం ఎప్పటికీ మరణం లేదు.

ఇప్పుడు మల్లి మస్తాన్ బాబుకి అవార్డులు ఇవ్వాలని, ఆయన పేరిట స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని... ఇలా రకరకాల ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.  వద్దు... ఎవరికి పడితే వాళ్ళకి, పైరవీలు చేసుకుంటే అడ్డమైనవాళ్ళకి కూడా  ఇచ్చే ఇలాంటి అవార్డులు, స్మారక చిహ్నాలతో ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేయకండి... ఇప్పటికే ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కేశాడు. ఇప్పుడు ఆయనకు ఇలాంటి అవార్డులు ఇచ్చి, ఆయన్ని ఆ శిఖరాల మీద నుంచి కిందకి దించకండి.. ప్లీజ్... మల్లి మస్తాన్ బాబు జీవించినంతకాలం ఎవరి నుంచీ ఏమీ ఆశించకుండా పేరుకు తగ్గట్టుగానే మల్లెపూవులా స్వచ్ఛంగా బతికాడు. ‘మల్లి’ వాడిపోయినా, రాలిపోయినా, ఆయన దేశంకోసం చేసిన త్యాగం తెలుగువారి మనసులలో పరిమళాలను వెదజల్లుతూనే వుంది. అదే ఆయనకు అసలైన నివాళి. మల్లి మస్తాన్ బాబుకు ఈ దేశ ప్రజల తరఫున ‘తెలుగువన్’ సెల్యూట్ చేస్తోంది.