ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయాలు అవసరమా?
posted on Apr 28, 2015 9:38AM
‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాము కానీ ఎప్పుడిస్తామో ఖచ్చితంగా చెప్పలేమని” కేంద్రమంత్రులు చెపుతున్నారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ‘ప్రత్యేకహోదా’ కోసం నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు. ఆయనకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రులు వాదిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతామని చాలా మంది రాష్ట్ర మంత్రులు చెపుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాల కంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు రాష్ట్రానికి సాధిస్తామని మంత్రి పల్లె రఘునాధ రెడ్డి హామీ ఇస్తున్నారు. అధికార ప్రతిపక్షాల, కేంద్ర రాష్ట్ర మంత్రుల ఈ మాటలన్నీ వింటుంటే వారి పోరాటాలు, ఆరాటాలు అన్నీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమా లేక పార్టీల రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమా? అనే అనుమానం కలుగక మానదు.
ఈ అంశం గురించి మాట్లాడుతున్న వారందరికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందులు, అవరోధాలు ఉన్నాయో స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఎవరూ కూడా ఆ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడటం గమనిస్తే వారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే తపన కంటే ఈ విషయంలో కేవలం తమకి మాత్రమే చాలా చిత్తశుద్ధి ఉందని ప్రజలకు చెప్పుకొని ప్రజల మెప్పు పొందాలనే తపనే ఎక్కువగా కనబడుతోంది. ప్రతిపక్ష పార్టీలయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే తపన కంటే ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఈ విషయంలో తడబడుతున్న కేంద్రప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.
రాష్ట్ర విభజన సమయంలో, ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు హామీలు గుప్పించినందున ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నప్పటికీ, అందరికీ తెలిసిన అనేక అడ్డంకులు, సాంకేతిక సమస్యల కారణంగా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇంతకు ముందు ఓసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొంచెం దైర్యం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని చెప్పారు. కానీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల విమర్శలకు భయపడి మళ్ళీ ఆ మాట వెనక్కి తీసుకోవలసి వచ్చింది.
కానీ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంగతి అర్ధమవుతుంది. ఇంతకు ముందు రాష్ట్ర విభజన జరగడం అనివార్యమనే సంగతి అన్ని రాజకీయ పార్టీలకీ తెలిసి ఉన్నప్పటికీ, ప్రజలకు ఆగ్రహం కలిగించడం కంటే వారి అబిప్రాయలకు అనుగుణంగా మాట్లాడుతూ వారిని మెప్పించడం కోసమే ప్రయత్నించాయి. అందువల్ల అంతిమంగా రాష్ట్ర ప్రజలే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో మళ్ళీ నష్టపోయేది రాష్ట్ర ప్రజలే.
ఒకవేళ కేంద్రప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలనని ప్రకటించగలిగితే అంతకంటే సంతోషకరమయిన విషయం మరొకటి ఉండబోదు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి ఉన్నప్పుడు కూడా ఇంకా దాని కోసం వృధా పోరాటాలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటూ ఈ అంశం పట్టుకొని ఉద్యమిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దాని వలన వాటికి ఎటువంటి నష్టమూ జరుగదు. కానీ అంతిమంగా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే నష్టపోతారు. కనుక ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టుకొని కూర్చొనే కంటే కేంద్రం ఇస్తానంటున్న స్పెషల్ ఆర్ధిక ప్యాకేజీ, సబ్సిడీలు ఇతర ప్రయోజనాలను తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చును.