బోరుబావిలో పడిన ఐదేళ్ళ చిన్నారి మహి మృతి

బోరుబావిలో పడిన ఐదేళ్ళ చిన్నారి మహి మృతి చెందింది. బుధవారం (20వ తేదీ) రాత్రి బోరుబావిలో చిక్కుకున్న మహిని సహాయక సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం బయటకు తీశారు. మహిని వెంటనే అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మహి మృతిని జిల్లా కలెక్టర్ కూడా ధృవీకరించారు. ఈనెల 20న చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మహిని బయటకు తీసేందుకు సహాయ సిబ్బందితోపాటు సైన్యం, వైద్యులు 86 గంటల పాటు కృషి చేసి బయటకు తీశారు. అయినా వారి శ్రమ వృధా అయింది. బావిలో పడిన రోజే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. మహి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.