జగన్ కు ‘మహా ’డేంజర్ బెల్స్

ఎంకి పెల్లి సుబ్బి చావుకోచ్చిందంటారు. అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అసలే రాష్ట్రంలో ఘోర పరాజయంతో ఇటు జనానికీ, అటు అసెంబ్లీకి ముఖం చూపించలేక ప్రెస్ మీట్లతో నెట్టుకొచ్చేస్తున్న జగన్ కు మహారాష్ట్ర ఎన్నికలు మహా డెంజర్ గా పరిణమించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీకి అత్యంత అవసరం, కీలకం కూడా. అయితే ఈ ఎన్నికలలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో సంభవించిన రాజకీయ పరిణామాలు బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమయ్యాయంటున్నారు. మహాలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఆ రాష్ట్రంలోని రెండు అత్యంత కీలకమైన బలమైన ప్రాంతీయ పార్టీలను చీల్చింది. బీజేపీ పుణ్యమా అని రాష్ట్రంలో బలమైన శివసేన రెండుగా చీలి బలహీన పడింది. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్డీయే కూడా నిట్ల నిలువుగా చీలి రెండు ముక్కలైంది. ఈ రెండు చీలిక వర్గాలూ కూడా బీజేపీ పంచన చేరి ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయం సాధించలేకపోతే.. శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలకు బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు ఆ రెండు చీలిక వర్గాలకూ కలిపి లోక్ సభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎన్డీయేలో కొనసాగుతారా లేదా అన్న విషయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయంపై ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు జగన్ కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  ఫర్ సపోజ్ మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించలేకపోతే  కేంద్రంలో ఎన్డీయే సర్కార్ చిక్కుల్లో పడుతుంది. ఎందుకంటే లోక్‌సభలో సింపుల్ మెజారిటీకి  272 స్థానాలు అవసరం కాగా, బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం, జేడీయూల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. మొత్తం మిత్రపక్షాలతో కలిసి లోక్ సభలో ఎన్డీయే బలం 293. ఒక వేళ మహా ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైతే  శివసేన, ఎన్సీపీ ఎంపీలు ఏడుగురినీ ఎన్డీయే సభ్యులుగా భాజించలేం. అంటే ఏడుగురు సభ్యుల మద్దతును బీజేపీ కోల్పోతుంది. అంటే లోక్ సభలో ఎన్డీయే బలం 286కు పడిపోతుంది.

అంటే కేంద్రంలో బీజేపీ మరింత బలహీనపడుతుంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం నిస్సందేహంగా అవకాశంగా తీసుకుని జగన్ కేసుల సత్వర విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుంది. అంటే ఫలితాల తరువాత జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు బెయిలు రద్దు పిటిషన్ లో సీబీఐ జగన్ బెయిలు రద్దు చేయాలంటూ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలు జగన్ కు మహా డేంజర్ గా మారాయని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.