మహా ఎన్నికలు.. 99 మందితో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీజేపీ

మహా ఎన్నికల సమరంలో పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసే 99 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో 289 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపీకపై బీజేపీ దృష్టి సారించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత తొలి జాబితాను విడుదల చేసింది.  పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్  నాగసూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్ కులే కామఠీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం శ్రీజయ చవాన్  భోకర్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగనున్నారు.  రాష్ట్రంలోని మొత్తం 388 స్థానాలకు గాను బీజేపీ 151 స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలైన షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గాలకు కేటాయించింది.  ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో  అధికార బీజేపీ నేతృత్వంలో ‘‘మహాయుతి’’ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ కూటమి మధ్య పోటీ ఉంది. మహాయుతిలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు ఉండగా.. మహావికాస్ కూటమిలో కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే శివసేన- శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహావికాస్ కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చింది.  త్వరలోనే ఈ కూటమి పార్టీలు కూడా  అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో వచ్చే నెల 20న జరుగుతాయి. ఫలితాలు అదే నెల 23న వెలువడతాయి. 

2019లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2021లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో  మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తరువాత కొంత కాలానికి   ఎన్సీపీ నుంచి కూడా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు   ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి రెండు కూటములకూ ప్రతిష్ఠాత్మకంగా మారాయి.  ప్రజలు ఏ కూటమి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు ఆగాల్సిందే.