తమిళనాడు తెలుగు విద్యార్ధులకు మద్రాసు హైకోర్టు ఊరట..

నిర్భంధ తమిళం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలుగు ప్రజలకు ఊరట లభించింది. తమిళ ప్రభుత్వం నిర్బంధ తమిళం పేరుతో జీవో జారిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్ని విద్యార్ధులు తమిళంలోనే రాయాల్సి ఉంది. ఒక్క తెలుగు విద్యార్ధులు మాత్రమే కాదు.. కన్నడ, మళయాళ ఉర్ధూ పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిఉంది. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు పలు ఆందోళనలు చేపట్టినా ఫలితం శూన్యం. దీంతో అఖిల భారత తెలుగు సమాఖ్య నేతృత్వంలోని మైనారిటీ భాషా సంఘాలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్ని విద్యార్థులు వారి మాతృభాషలోనే రాయవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ చట్టంపై తెమిళనాడు ప్రభుత్వంపై మొట్టికాయలు కూడా వేసినట్టు తెలుస్తోంది. నిర్బంధ తమిళంపై చేసిన చట్టం సదుద్దేశంతో రూపొందించినది కాదని, ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. అసలు 2006లో చట్టం రూపొందగా, ఆరేళ్ల తర్వాత 2012లో ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం తెలుగు భాషపై వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టంపై ఆ రాష్ట్ర హైకోర్టు అండగా ఉంటడం శుభపరిణామామే.