ధనవంతులు కావాలని అనుకునేవారు ఈ ప్రదేశాలకు దూరంగా ఉండాలి..!
posted on Jan 23, 2025 9:30AM

ఆచార్య చాణక్యుడే కౌటిల్యుడు అని కూడా పేరు పొందాడు. ఈయన రాజనీతిని మాత్రమే కాకుండా ఆర్థిక నీతిని, తత్వజ్ఞానాన్ని కూడా బోధించాడు. ఆయన సలహాల ద్వారా, ఈయన మార్గనిర్దేశకత్వంలో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మనిషి జీవితంలో ధనవంతులు కావాలన్నా, పేదవాడు కావాలన్నా అది అతను తీసుకునే నిర్ణయాలు, అతని ఆలోచలన మీదనే ఆధారపడి ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా ఒక వ్యక్తి ధనవంతుడు కావాలనే ఆలోచినలో ఉంటే కొన్ని రకాల ప్రదేశాలకు దూరంగా ఉండాలట. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుంటే..
ధనమేరా అన్నింటికి మూలం అని రాశాడు ఓ రచయిత. డబ్బు మనిషి జీవితాన్ని శాసిస్తోంది. అలాంటి డబ్బును కూడబెట్టుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. అయితే డబ్బు అభివృద్ది చెందేలా చేయడం కూడా ఓ కళనే.. అది అందరికీ సాధ్యం కాదు. కానీ కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండటం వల్ల డబ్బు వృథా కావడాన్ని అరికట్టవచ్చు.
ఉపాధి లేని ప్రదేశాలు..
ఉపాధి ఉంటేనే మనిషి ఆర్థికంగా ఎదగగలడు. వాణిజ్య కార్యకలాపాలు లేని ప్రదేశాలో నివసించడం మంచిది కాదట. ఉపాధి సరిగా లేని ప్రదేశాలలో నివసించే ప్రజలు పేదరికంలోనే ఎక్కువ మగ్గిపోతారట. వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు, బ్రాహ్మణులు నివసించని ప్రాంతాలలో నివసించడం కూడా మంచిది కాదట. బ్రాహ్మణులు సమాజంలో మతపరమైన, సాంస్కృతిక విలువలను రక్షిస్తారు. అలాంటి బ్రాహ్మణులు లేని స్థలంలో పురోగతి అనేది ఎక్కువగా ఉండదట. బ్రాహ్మణులు ఉన్న ప్రదేశాలలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని అంటారు. పాజిటివ్ వైబ్రేషన్ లేకుంటే ఆర్థిక వృద్ధి కూడా ఉండదు.
నీరు లేని ప్రాంతాలు..
నీరు లేని జీవితాన్ని ఊహించలేము. నదులు, చెరువులు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రదేశాలలోనే జీవించాలి. ఇవి లేని ప్రదేశాలలో నివసించేవారు ఆర్థికంగా అభివృద్ది చెందలేరు. నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాలలో నివసిస్తే చాలా వరకు నీటి సమస్యల కారణంగా సమయం వృథా అవుతుంది. చాలా వరకు సంపాదనా అవకాశాలకు అంతరాయం కూడా ఏర్పడుతుంది.
వైద్య సౌకర్యాలు..
వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అత్యవసర సమయంలో వైద్య సదుపాయం ఉన్నప్పుడు చాలా మంది ప్రాణాలు నిలబడతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలిగే వైద్య సేవలు లేని ప్రదేశాలలో నివసిస్తే ఆర్థిక ఎదుగుదల ఉండదు.
*రూపశ్రీ.