చేతికొచ్చిన వరి పంటకు తామే నిప్పు పెడుతున్న రైతన్నలు.. దయనీయ స్థితిలో అన్నదాత
posted on Oct 30, 2020 8:49PM
కామారెడ్డి జిల్లాలో సన్నరకం వరికి తెగులు సోకి పంట మొత్తం నాశనం కావడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు. చేతికొచ్చిన వరి పంటకు దోమపోటు సోకడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పండిన పంట నెలకొరగడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని దిగాలు పడిన రైతులు పంటకు నిప్పు పెడుతున్నారు. రాజంపేట్ మండలం.. ఎల్లారెడ్డి పల్లి తండా కు చెందిన రైతులు బాబూలాల్, శ్రీనివాస్ లు చెరి రెండు ఎకరాల సన్నరకం వరి సాగు చేశారు. అయితే దోమపోటుతో గింజ కూడా రాకపోవడంతో వరి పంటకు నిప్పంటించారు. దీంతో వేల రూపాయల నష్టం వాటిల్లిందని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరో పక్క లింగంపేట్ మండలంలో సన్నరకం వరి 6000 ఎకరాలలో సాగు చేయగా దాదాపు 2000 ఎకరాలకు పైగా దోమపోటు, అగ్గి తెగులు సోకాయి. ఒకపక్క మార్కెట్ లో సన్నరకం వరికి మద్దతు ధర లేకపోగా.. మరోపక్క దోమపోటు, తెగుళ్లు సోకడంతో కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం చామన్ పల్లికి చెందిన రైతు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో తన రెండెకరాల పొలంలో దొడ్డు రకం వరి సాగు చేయగా లాభలు వచ్చాయని.. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ సారి సన్న రకం వరి సాగు చేయగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటపొలంలో వర్షం నీరు నిలిచింది. దీంతో వరిపంట దోమపోటుకు గురై ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట వస్తుందని భావించిన రైతు తీవ్ర మనస్థాపానికి గురై.. ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా.. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. రైతన్నల బతుకులు మాత్రం మారడం లేదు. వర్షాలు లేక కొన్ని సార్లు, వర్షాలు ఎక్కువై కొన్ని సార్లు పంట చేతికి రాక పెట్టుబడులు కూడా పోగొట్టుకుంటున్నారు. తాను పండించే పంటను పసిపాపలా భావించి.. కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాత ఆ పంటకు తానే నిప్పు పెట్టడం అత్యంత విషాదకరం.