‘మా’ ఎన్నికల పోలింగ్ పూర్తి
posted on Mar 29, 2015 4:00PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. ‘మా’లో మొత్తం 702 ఓట్లు వున్నాయి. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే ‘మా’ ఎన్నికలు ఈసారి పోలింగ్ వరకూ వెళ్ళడంతోపాటు అధ్యక్ష పదవికి పోటీలో వున్న జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాలు ఒకరినొకరు తిట్టుకోవడం, ఆరోపణలు చేసుకోవడంతో వార్తల్లో నిలిచాయి. ‘మా’ ఎన్నికలతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఎవరు గెలిచినా జనానికి ఒరిగేదేమీ లేకపోయినా అందరూ ఈ ఎన్నికల మీద ఆసక్తి చూపించారు. బాగా వార్తల్లో నానిన అంశం కాబట్టి ‘మా’లో సభ్యులు ఓట్లు వేయడానికి క్యూ కడతారని అందరూ భావించారు. అయితే ఓట్లు వేయడానికి వచ్చినవారు మాత్రం చాలా తక్కువ. చిన్నచిన్న వేషాలు వేసేవారు మాత్రం ఓటు వేయడానికి ఉత్సాహంగా వచ్చారుగానీ, స్టార్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కోర్టు అనుమతితో ఫలితం వెల్లడవుతుంది. ఆ తర్వాత నిన్నటి వరకూ తిట్టుకున్నవారు భుజాల మీద చేతులు వేసుకుని మాది ‘మా’ కుటుంబం అని నవ్వుతూ చెబుతారు.