అమరావతిలో లులూ ప్రతినిథుల పర్యటన.. ఎందుకో తెలుసా?

ఒక్క‌చాన్స్ ప్లీజ్  అంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఆయన ఐదేళ్ల పాలనలో  క‌క్ష‌పూరిత రాజ‌కీయాలతో ప్రత్యర్థి పార్టీల నేతలనే కాకుండా సామాన్య ప్రజలను కూడా వేధింపులకు గురి చేశారు.  అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దణ్ణం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి, ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ప్రఖాతి చెందిన లూలూ సహా పలు పరిశ్రమలు జగన్ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలివెళ్లిపోయాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా తెలంగాణకు తరలిపోయింది. కొత్త పరిశ్రమల సంగతి అలా ఉంచితే ఉన్న పరిశ్రమలనే తరిమేసేలా జగన్ ఫారిశ్రామిక విధానం ఉంది. దీంతో జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం  పూర్తిగా పడకేసింది. కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్నవి మిగలలేదు అన్నట్లుగా అప్పటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ పతనమై నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిందో అప్పటి నుంచీ రాష్ట్ర పారిశ్రామిక రంగం పూర్వ వైభవం సంతరించుకునే దిశగా పరుగులు పెడుతోంది. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ కు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత రాష్ట్యరానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దిగ్గజ సంస్థల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.   అంతే కాకుండా  గతంలో జగన్ దాష్టీకం, అస్తవ్యస్థ, అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పు కోవలసినది లూలూ గ్రూప్ గురించి. హైపర్ మార్కెట్లు, మల్టిప్లెక్సల నిర్మాణం, నిర్వహణల్లో ప్రపంచంలోనే పెరెన్నిక గన్న లూలూ గ్రుప్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ ఏపీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే విశాఖలో దాదాపు 1500 కోట్ల పెట్టుబడులతో విశాఖలో ఓ మాల్, కన్వెన్షన్ సెంటన్ ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

అదే సంస్థ ప్రతినిథులు శుక్రవారం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. వీరి పర్యటనలో అడుగడుగునా సీఆర్డీయే అధికారులు దగ్గరుండి మరీ వారిని గైడ్ చేశారు. ఇప్పుడు లూలూ సంస్థ ప్రతినిథుల అమరావతి పర్యటనే టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ఒక్క విశాఖలోనే కాకుండా అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు లూలూ ఆసక్తి చూపుతోందనీ, అందుకోసమే ఆ సంస్థ ప్రతినిథులు అమరావతిలో పర్యటించారనీ అంటున్నారు. లూలూ ప్రతినిథులు తమ పర్యటలో అమరావతి భవిష్యత్ లో ఎలా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ నిర్మాణాలు జరగనున్నాయి, నవనగరాల రూపురేకలు ఎలా ఉంటాయి వంటి వివరాలను ఆరా తీసినట్లు చెబుతున్నారు.   విశాఖలో లాగే అమరావతిలోనూ ఆ సంస్థ రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.