నియోజకవర్గానిక ఒక మల్టీ స్పెషాలిటీస్ ఆసుపత్రి.. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్లో  ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కనీసం వంద నుంచి 300 పడకలతో ఆ మల్టీ స్పెషాలిటీస్ ఆస్పత్రి ఉండాలన్నారు. వీటి నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖపై సచివాలయంలో శుక్రవారం (ఏప్రిల్ 4) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 70  మల్టీ స్పెషాలిటీస్ ఆస్పత్రులు ఉన్నాయనీ, మరో 105 నియోజకవర్గాలలో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.  ఈ ఆస్పత్రుల నిర్మాణం పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో జరిగేలా ఆలోచన చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి అందుకోసం ముందుకు వచ్చే సంస్థలకు పరిశ్రమలకు ఇచ్చినట్లుగానే సబ్సిడీ ఇచ్చే విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యసేవలను మరింత విస్తృత పరచాలని చెప్పారు.అదే విధంగా  అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

ప్రపంచ దేశాలకు వైద్య డెస్టినేషన్ అమరావతి అయ్యేలా మెడిసిటీ ప్రాజెక్టు ఉండలని చంద్రబాబు చెప్పారు.  తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతా రంగాలు విద్య, వైద్యమేనని స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలని అన్నారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.