మళ్లీ మొదటికొచ్చిన లోక్‌పాల్ వ్యవహారం

న్యూఢిల్లీ: లోక్‌పాల్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బిల్లు పరిధిలోకి ప్రధాని, ఉన్నతస్థాయి జడ్జీలు, ఎంపీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. బిల్లు ముసాయిదా కమిటీలోని పౌరసమాజ ప్రతినిధులు దీనిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సర్కారు దిగిరాకుంటే కమిటీ భేటీలను బహిష్కరించి, మళ్లీ ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. కమిటీ ఐదో సమావేశం మూడు గంటలపాటు జరిగింది. ‘భేటీ దారుణంగా జరిగింది. ప్రభుత్వ ఉద్దేశాలు పూర్తి అనుమానాస్పదంగా ఉన్నాయి. మా ప్రతిపాదనలను గట్టిగా వ్యతిరేకించింది. అవినీతికి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధంగా ఉండండి’ అని పౌరసమాజ సభ్యులు సమావేశం తర్వాత ప్రజలనుద్దేశించి ఓ ప్రకటన చేశారు. అందులో భేటీ వివరాలను వెల్లడించారు. ఇక ముందు జరిగే భేటీల్లో పాల్గొంటామని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకుంటే మళ్లీ వీధుల్లోకి వెళ్తామని అందులో తీవ్రంగా హెచ్చరించారు. సమావేశం వివరాల అంశాల వారీగా..

ప్రధాని, ఎంపీలు, పార్లమెంటులోపల వారి చర్యలు, సాయుధ బలగాలు, మొత్తం ప్రభుత్వాధికారులను బిల్లుపరిధిలోకి తేవాలని పౌరసమాజ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటే ప్రధాని పనితీరు దెబ్బతింటుందని ప్రభుత్వం చెప్పింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల సలహాలు తీసుకుంటామని, వచ్చే నెల 6న జరిగే భేటీలో వాటిని వివరిస్తామని తెలిపింది. ప్రధాని తదితరులు బిల్లు కిందికి రాకుంటే 2 వేల మంది అధికారుల కోసమే బిల్లు తేవాల్సి ఉంటుందని పౌరసమాజం ఆక్షేపించింది. ఈ సందర్భంగా పౌరసమాజం ప్రతినిధి ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ బోఫోర్సు కేసులో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ విచారణ పరిధిలో ఉన్నారని, అయితే ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి విచారణ అడ్డంకి కాలేదని అన్నారు. సీబీఐ, కేంద్ర విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) వంటి శాఖాపరమైన నిఘా వ్యవస్థలను లోక్‌పాల్‌లో విలీనం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జడ్జీలను బిల్లుపరిధిలోకి తెస్తే న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో రాజీపడినట్లవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వివాదంపై కమిటీ సభ్యుడు అన్నాహజారే స్పందిస్తూ, ప్రభుత్వం గడువులోగా ముసాయిదా బిల్లు తయారు చేస్తుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. వచ్చే నెల 30లోగా బిల్లును రూపొందించాలని నిర్ణయించడం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu