చైనాలో మళ్లీ లాక్ డౌన్.. మళ్లీ గోల మొదలు
posted on Mar 11, 2022 4:54PM
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎంతలా గడగడలాడించిందో అందరికీ తెలిసిందే. చైనాలో మరో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ రాకేట్ స్పీడ్‌లో విజృంభిస్తోంది. దీంతో చైనా ఈశాన్య నగరమైన చాంగ్ చున్‌లో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. అంతేకాకుండ కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చిందీ స్థానిక ప్రభుత్వం. స్థానికులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అదీ కూడా రెండు రోజులకు ఒక్కసారి మాత్రమే అంటూ ఆంక్షలు జారీ చేశారు. నగరంలో ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు మూడు సార్లు చేయించుకోవాలని ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే అత్యవసరం కానీ సేవలను ప్రభుత్వం రద్దు చేసింది. ట్రాన్స్ పోర్టు లింకులను సైతం ప్రభుత్వం మూసివేసింది.
2019, డిసెంబర్‌లో చైనాలోని వ్యూహాన్ నగరంలో ఈ కరోనా వైరస్ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ మొత్తం మూడు వేవ్‌లుగా వచ్చింది. అయితే సెకండ్ వేవ్ వల్ల ప్రపంచంలోని వివిధ దేశాల్లో చాలా మంది మరణించారు. థార్డ్ వేవ్ కూడా ఇటీవలే ముగిసింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో.. ప్రపంచ దేశాలు మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.