లంచాలకోసం రూటుమార్చిన ఎక్సైజ్ సిబ్బంది
posted on Mar 14, 2012 5:14PM
సుమారు రెండునెలల నుంచి మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు నిలిచిపోవడంతో కుదేలయిన ఎక్సైన్ సిబ్బంది ఇప్పుడు లంచాల కోసం రూటు మార్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాపుసారా కాసే వ్యక్తులు, కల్తీకల్లు అమ్మే వ్యాపారులు వివరాలు వారివద్ద ఉన్నాయి. ఈ జాబితా ఆధారంగా వారు ఆయా వ్యక్తుల వద్దకు వెళ్ళి ముడుపులు దండుకుంటున్నారు. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు వస్తున్నంత సేపూ వీరు ఈ చిల్లర వ్యాపారులను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎక్సైజ్ సిబ్బందికి ఈ చిల్లర వ్యాపారులే పెద్ద ఆదాయ వనరుగా మారారు. కల్తీ కల్లు తయారు చేసే వ్యాపారులు నేలకు ఇంతని ముడుపులు ఇస్తే వారిని ఏమీ చేయబోమని ఎక్సైజ్ ఉద్యోగులు హామీ ఇస్తున్నారు. నాటుసారా తయారీదారులు, విక్రేతలకు కూడా ఎక్సైజ్ సిబ్బంది ఇటువంటి భరోసానే ఇచ్చారు. ఎక్సైజ్ సిబ్బంది పదేపదే వచ్చి వేదిస్తుండటంతో వీరు గత్యంతరం లేక వారికి ముడుపులు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో యధావిధిగా ఎక్సైజ్ సిబ్బంది జేబులు అక్రమార్జనతో మళ్ళీ నిండుగా ఉంటున్నాయి. వారి మొహాలు కళ కళలాడుతున్నాయి.