పిల్లవాడిని వదిలి వెళ్తున్నారా!
posted on Jul 28, 2016 12:32PM
ఇంట్లో పిల్లలని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే ఎవరికి మాత్రం మనసు వస్తుంది. కానీ అనుకోకుండా ఓసారి ఏదన్నా ఆఫీసు పని మీదో, ఎవరినన్నా పరామర్శించడానికో పిల్లలని ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి రావచ్చు. అందులోనూ పాపో, బాబో ఒక్కరే ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్తామన్న మాటే కానీ మనసంతా వారి క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అలజడిని పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు కానీ, ఇంట్లో పిల్లలను వదిలి వెళ్లేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వారి క్షేమానికి గ్యారెంటీ ఇచ్చినట్లే అంటున్నారు పెద్దలు.
అందుబాటులో ప్రాణాంతకాలు
చాలా ఇళ్లల్లో కత్తెర, చాకు, లైటరు, అగ్గపెట్టె.... లాంటి వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ పడేసి ఉంటాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీటిని చేజిక్కించుకున్న పిల్లలకి వాటితో ఏదన్నా సాహసం చేయాలన్న సరదా పుట్టడం సహజమే! అలాంటి సాహసాలే ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లే ముందు ఒకసారి అలా ఇంట్లో కలియతిరగండి. ఇలాంటి వస్తువుల ఏమన్నా ఉంటే లోపల పడేయండి. గ్యాస్ స్టవ్ కట్టేసి ఉందా లేదా! గీజర్ వంటి వస్తువులు ఏవన్నా ఆన్‌లో ఉన్నాయేమో ఓసారి చూసుకుని బయల్దేరండి.
ఫోన్ నెంబర్లు
ఇంట్లో పిల్లలకి, తల్లిదండ్రులు ఫోన్ నెంబర్లు గుర్తుంచుకునేలా చేయడం చాలా అవసరం. వీటిని బట్టీ పట్టించడంలో ఏ తప్పూ లేదు సరికదా, ఒకోసారి అ నెంబర్లే పిల్లవాడని ప్రమాదం నుంచి కాపాడవచ్చు కూడా! కాబట్టి అవసరం అయినప్పుడు మీ నెంబరుకి ఫోన్ చేయమని పిల్లవాడికి చెప్పి ఉంచండి. చాదస్తం అనుకోకుండా పోలీస్, ఫైర్, ఆంబులెన్స్ వంటి సర్వీసులకు సంబంధించిన నెంబర్లను కూడా అతనికి చెప్పి ఉంచండి.
అపరిచితులకు నో ఎంట్రీ!
మరీ సన్నిహితులైతే ఇంటి తలుపులను బార్లా తెరిచి ఆహ్వానించకూడదన్న జాగ్రత్త పిల్లలకు అందించాలి. గ్రిల్స్ మాటు నుంచో, డోర్ చెయిన్ వెనుక నుంచో సమాధానం చెబితే సరిపోతుంది. వచ్చినవాళ్లు మరీ తమకి కావల్సిన జవాబుల కోసం పట్టుబడితే, మీకు ఫోన్ చేయమని సూచించండి. ఎవరూ లేని సమయంలో మొహమాటానికి పోయి, అపరిచితులను లోనికి రానిస్తే ఉపయోగం కాదు కదా ప్రమాదానికే అవకాశాలు ఎక్కువ.
గమనించేందుకు ఎవరన్నా...
పిల్లలని ఒంటరిగా వదిలి వెళ్తున్న విషయం పొరుగువారికి తెలియచేసి, అప్పుడప్పుడూ కాస్త గమనించమని అభ్యర్థించడం మంచిది. దాని వల్ల వాళ్లూ కాస్త ఇంటిని గమనిస్తూ ఉంటారు, పిల్లలకూ తాము బుద్ధిగా మసలుకోవాలన్న జాగ్రత్తా ఉంటుంది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మనమే మధ్యలో ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పిల్లవాడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడేమో విచారిస్తే సరి!
ఏదన్నా వ్యాపకం...
పిల్లలకు ఏదన్నా వ్యాపకాన్ని అందించి వెళ్తే వాళ్ల మనసు ఇక అటూ ఇటూ చెదరదు. ఒక ప్రాజెక్టువర్కో, పుస్తకమో, పిల్లల సినిమానో... ఇలా అతని ఏకాగ్రతని ఆకర్షించే పని ఏదాన్నా కల్పించి వెళ్తే మంచిది. ఇక వీలైతే అతని స్నేహితుని కూడా పిలుచుకొమ్మని చెబితే అటు కాలక్షేపానికీ, ఇటు భద్రతకీ లోటు ఉండదు.
- నిర్జర.