భారీగా క‌రోనా.. ఆర్బీఐ ఆందోళ‌న‌..

రెండు రోజులుగా నిల‌క‌డ‌గా ఉన్న క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం కల‌వ‌రం సృష్టిస్తోంది. తాజాగా, మ‌రో 3,82,315 మందికి క‌రోనా సోక‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో 3,780 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.  

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. మొత్తం 2,06,65,148 కేసులు,  2,26,188 మ‌ర‌ణాల‌తో దేశంలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. 

కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటమే కాస్త‌ ఊరటనిచ్చే అంశం. మంగ‌ళ‌వారం ఒక్క రోజే 3,38,439 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య  1,69,51,731కి చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 34,87,229కి పెరిగింది. 

ఇక‌, తెలంగాణలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మంగ‌ళ‌వారం 77,435 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా.. అందులో 6,361 మందికి పాజిటివ్ వ‌చ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,225 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మంగ‌ళ‌వారం 8,126 మంది కోలుకున్నారు.   

కరోనా సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోందని ఆర్బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని.. కంటైన్‌మెంట్ ప్రాంతాలు, భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.