మోడీ మళ్లీ వస్తే.. దేశంలో ఇవే ఆఖరి ఎన్నికలు.. పరకాల ప్రభాకర్
posted on Apr 4, 2024 2:46PM
కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ... ఏమి జరుగుతుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్’లా రాజ్యాంగాన్ని మార్చేసి జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో ఉండేలా, రాజ్యంగాని మార్చి రాచరిక వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు వీలుగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందా అన్న అనుమానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పలు రాజకీయ పార్టీలు ఔననే అంటున్నాయి.
సరే అవన్నీ రాజకీయ పార్టీలు కనుక.. మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి కనుక అవే అటువంటి అనుమానాలను వ్యక్తం చేసి, వాటికి అవే ఔనని సమాధానాలు కూడా సరఫరా చేశాయని భావించొచ్చు. కానీ.. కేంద్ర విత్తమంత్రి భర్త, ప్రముఖ సామాజిక, ఆర్థిక విశ్లేషకుడు అయిన పరకాల ప్రభాకర్ కూడా మోడీ మళ్లీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోకుంటే దేశంలో ఇవే ఆఖరి ఎన్నికలు అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పరకాల ప్రభాకర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ గత పదేళ్లుగా అమలు చేస్తున్న విధానాలను గమనిస్తే ఈ విషయం అవగతమౌతోందని పరకాల అన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే, కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరితే.. ఇవే విధానాలను కొనసాగిస్తే దేశంలో బహుశా ఇవే ఆఖరు ఎన్నికలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన మణిపూర్ ఘటనలను ఉదహరించారు. మణిపూర్ లో గత ఏడాది కాలంగా హింసాకాండ ప్రజ్వరిల్లుతున్నా.. ఆడపిల్లలను నగ్నంగా ఉరేగించిన సంఘటనలు జరిగినా ప్రధాని మోడీకి అక్కడి వెళ్లేందుకు తీరిక లేదు. అయినా కూడా జనం మనను అంగీకరించారన్న భావన బీజేపీలో కలిగితే .. అవే పరిస్థితులు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ జరిగే ప్రమాదం ఉందని పరకాల ప్రభాకర్ అన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా నిలువరించడానికి ఒక అవకాశం 2024 ఎన్నికలలో దేశ ప్రజలకు ఉందని ఆయన అన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుంటే.. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తీసుకువచ్చిన వారౌతారని ఆయన హెచ్చరించారు.