విశాఖలో అమాంతం పెరిగిన భూ-లావాదేవీలు... కిటకిటలాడుతున్న సబ్-రిజిస్టర్ కార్యాలయాలు... 

పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో విశాఖలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. వైజాగ్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో భూలావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. దాంతో, విశాఖ సబ్-రిజిస్టర్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మధురవాడ, ఆనందపురం సబ్-రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు టోకెన్ విధానం తీసుకువచ్చారు.

ముఖ్యంగా రియల్టర్ల కన్ను విశాఖపై పడటంతో చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. దాంతో, సబ్-రిజిస్టర్ కార్యాలయాల్లో హడావుడి పెరిగింది. సహజంగానే విశాఖ నగరంలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించడంతో అది మరింత ఎక్కువైంది. ఎటుచూసినా జనాలు, కార్ల హడావుడితో ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ పక్రియ కొనసాగుతోంది.

విశాఖ పరిసర ప్రాంతాల్లో భూములపై పెట్టుబడులు పెట్టడానికి, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజధాని ఏర్పాటైతే ధరలు మరింత పెరుగుతాయనే ఆలోచనతో ఇప్పుడే కొనుగోళ్లు చేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భూముల ట్రేడింగ్‌లో 12.5శాతం వృద్ధిరేటు పెరిగింది. జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, ఎంవీపీ కాలనీ, సీతమ్మ ధార, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతోంది. విశాఖ శివారు ప్రాంతాల్లో కూడా భూముల ధరలు కొండెక్కుతున్నాయ్‌. ముఖ్యంగా మధురవాడ ప్రాంతం రాజధానిగా ప్రకటించిన ప్రాంతానికి అతి చేరువలో ఉండటంతో రిజిస్ట్రేషన్ల హడావిడి ఎక్కువగా ఉంది. దాంతో, తాకిడిని నియంత్రించడం కోసం టోకెన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.