కుప్పంలో తెలుగుదేశం ఏజెంట్లకు వైసీపీ అభ్యర్థి బెదరింపులు
posted on May 13, 2024 4:49PM
కుప్పం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిని బద్దలు కొడతామంటూ ఇంత కాలం వైసీపీ ప్రగల్భాలు పలికింది. వైనాట్ కుప్పం అంటూ జగన్ విర్రవీగి మాట్లాడారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. అయితే ఆయన కుప్పం నుంచి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు కదా అన్న కుప్పం ప్రజల విశ్వాసాన్ని ఇసుమంతైనా దెబ్బతీయలేకపోయారు. దీంతో ఇక పోలింగ్ రోజున బెదరింపుల పర్వానికి దిగారు.
కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ స్వయంగా తెలుగుదేశం ఎజెంట్లను బదిరించారు. రామకుప్పంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లి మరీ భరత్ తెలుగుదేశం ఏజెంట్లను బెదిరించారు. ఒక్క రామకుప్పంలోనే కాకుండా నియోజకవర్గంలోని పలు బూత్ లలోకి వెళ్లిన వైసీపీ అభ్యర్థి తెలుగుదఏశం ఏజెంట్లను బెదిరించారు. తన మాట వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
సింగ సముద్రంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లిన భరత్ తలుపులు మూసేసి పోలింగ్ నిలిపివేయడానికి తెగించారు. అయితే ఆ బూత్ లో ఉన్న తెలుగుదేశం ఏజెంట్లు గట్టిగా ప్రతిఘటించి తలుపులు తెరిచారు. తెగించి దాడులకు, బెదరింపులకు పాల్పడుతున్న భరత్ వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ ఫిర్యాదులు అందాయి. భరత్ ఫ్రస్ట్రేషన్ తో పోలింగ్ బూతులన్నీ కలియదిరుగుతూ తెలుగుదేశం ఏజెంట్లపై బెదరింపులకు పాల్పడటం కుప్పంలో వైసీపీకి ఎదురుగాలి ఎంత తీవ్రంగా వీస్తోందో తెలియజేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.